‘అనంత’లో హెల్త్ ఎమర్జెన్సీ
– కలెక్టరేట్, కార్పొరేషన్‌లో కంట్రోల్ రూంలు
– ఆర్‌ఎంపీ క్లినిక్‌లు 24 గంటల్లోపు సీజ్ చేయండి
– సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
– అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి
– అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్/సిటీ/టౌన్ : ‘అనంతపురం నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాం. జిల్లా వ్యాప్తంగా ఆర్‌ఎంపీ క్లినిక్‌లను 24 గంటల్లోపు సీజ్ చేయండి. హె ల్త్ ఎమర్జెన్సీ ముగిసే వరకు వాటిని తెరవరాదు. దీన్ని బేఖాతరు చేసే ఆర్‌ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి. ప్రజారోగ్య పరిరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. మీకు ఇప్పటికే ఒకట్రెండుసార్లు చెప్పా. ఇకపై చెప్పేది ఉండద’ని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులను హెచ్చరించారు. డెంగీతో అనంతపురంలో ఇద్దరు చిన్నారులు మతి చెందిన నేపథ్యంలో కలెక్టర్ శనివారం పలు సమావేశాలు నిర్వహించి.. సీజనల్ వ్యాధుల నివారణ కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ముందుగా తన క్యాంప్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొíß ద్దీన్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ నుంచి ఆర్‌డీఓలు, తహశీల్దారులు, మునిసిపల్ కమిషనర్లు, వైద్యాధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఏపీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్వామా హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని వినాయక్‌నగర్‌లో చోటు చేసుకున్నటువంటి ఘటనలు జిల్లాలో ఎక్కడా పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, గ్రామ స్థాయిలో ఈఓఆర్‌డీలు బాధ్యత వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీల సమావేశాలని నిర్వహించుకుని.. కార్యాచరణతో ముందుకు పోవాలన్నారు.
సీజనల్ వ్యాధుల నివారణకు నగర పాలక సంస్థ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం (08554–230234) ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని ప్రతి డివిజన్‌కు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. 44 మురికివాడల్లో 126 మంది నర్సింగ్ విద్యార్థులతో ఇంటింటా సర్వే చేయించి జ్వర పీడితులను గుర్తించాలన్నారు. 600 మంది పారిశుద్ధ్య సిబ్బందికి తోడు అదనపు సిబ్బందిని, ట్రాక్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. మురికి కాలువలన్నీ శుభ్రం చేయించాలని, అన్ని ప్రాంతాల్లో అపరిశుభ్రత తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. దోమల నివారణకు కాలువల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్ తప్పనిసరిగా చేయించాలన్నారు. పందులను తక్షణమే ఊరిబయటకు తరలించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసును ఆదేశించారు.
అన్ని మునిసిపాలిటీల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మిని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీజనల్ వ్యాధులపై సమాచారం తెలుసుకోవడానికి కలెక్టరేట్‌లో సెంట్రల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో విషజ్వరాలు ఏ మూలన ప్రబలినా తక్షణమే స్పందించాలని డీఎంహెచ్‌ఓతో పాటు జిల్లా మలేరియా నివారణ అధికారి దోసారెడ్డిని ఆదేశించారు. హిందూపురం, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ చికిత్స కోసం తగినన్ని ప్లేట్‌లెట్స్, మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. విషజ్వరాలతో ఏ ఒక్కరు మతి చెందినా ఆ వివరాలను వెంటనే ఎస్‌ఎంఎస్ ద్వారా తనకు తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధుల నివార ణపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం 10 లక్షల కరపత్రాలను డ్వాక్రా మహిళల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయించాలని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లుకు సూచించారు.
ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవద్దు : జేసీ
అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో భయాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకోవాలని చూడటం సరైంది కాదని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హితవు పలికారు. శనివారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ఆస్పత్రుల నిర్వాహకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జ్వరాలన్నీ డెంగీ కాదని, రక్తపరీక్ష అనంతరమే వ్యాధిని నిర్ధారించాలని సూచించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డెంగీ బాధితుల కోసం అనంతపురం, హిందూపురం ప్రభుత్వాస్పత్రులు, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ప్లేట్‌లెట్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో డెంగీ లక్షణాలు ఉంటే ఇక్కడికి మాత్రమే పంపాలన్నారు. అలా కాదని బెంగళూరు, హైదరాబాదులాంటి నగరాలకు వెళ్లమని సూచిస్తే చర్యలు తప్పవన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 45 ఆర్‌ఎంపీ క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు సంబంధించి ధరల పట్టికను తప్పక ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సర్వజనాస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ రామస్వామినాయక్, ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓ శివకుమార్, డెమో హరిలీలాకుమారి తదితరులు పాల్గొన్నారు.