రత్నగిరి.. భక్తజనఝరి
రత్నగిరి.. భక్తజనఝరి
Published Tue, Feb 7 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
- భీష్మ ఏకాదశి పర్వదినాన పోటెత్తిన భక్తులు
- సోమవారం రాత్రి నుంచే వెల్లువలా రాక
- స్వామివారిని దర్శించిన 80 వేల మంది
- రూ.60 లక్షల ఆదాయం
అన్నవరం (ప్రత్తిపాడు) : కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడు, రత్నగిరి వాసుడు అయిన సత్యదేవుని సన్నిధి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో జనసంద్రంగా మారింది. సుమారు 80 వేలమంది సత్యదేవుని దర్శించుకున్నారు. 7,276 వ్రతాలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో వేలాదిగా భక్తులు సోమవారం సాయంత్రం నుంచే రత్నగిరికి చేరుకోవడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం వరకూ భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే వ్రతాలు, స్వామివారి దర్శనాలు ప్రారంభించారు. అప్పటినుంచి సాయంత్రం వరకూ స్వామి సన్నిధికి భక్తులు వస్తూనే ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. వ్రతమండపాలన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. దీంతో ఉదయం పది గంటల వరకూ స్వామివారి నిత్యకల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. సర్క్యులర్ మండపంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారి నాగేంద్రరావు అన్నవరం దేవస్థానానికి రూ.50 వేల విలువైన 6 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. ఈ ఒక్క రోజే దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సత్యదేవునికి లక్ష పుష్పార్చన
భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్ల మూలవరులకు లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకుడు గాడేపల్లి వేంకట్రావు తదితర అర్చకస్వాములు, రుత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవారం రాత్రి గరుడ వాహనంపై ఘనంగా ఊరేగించారు. తొలి పావంచా వద్ద దేవస్థానం చైర్మన్ రాజా రోహిత్, ఈఓ నాగేశ్వరరావు దీనిని ప్రారంభించారు.
Advertisement
Advertisement