రత్నగిరికి పోటెత్తిన భక్తులు
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
Published Sun, Aug 13 2017 11:26 PM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM
ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ జామ్
అన్నవరం(ప్రత్తిపాడు) : రత్నగిరిపై కొలువైన శ్రీసత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ఆలయంతో పాటు, ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సాయంత్రం వరకూ భక్తులు తండోప తండాలుగా వస్తూనే ఉన్నారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రత్నగిరిపై వివాహాలు జరిగాయి. దానికి తోడు వరుస సెలవులు కావడం కూడా భక్తులు పోటెత్తడానికి కారణమైంది.
వ్రతాల కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు..
సత్యదేవుని వ్రతాలాచరించేందుకు భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రధానంగా రూ.200, రూ.400 వ్రతాలాచరించే భక్తులైతే భారీ క్యూలో వేచి ఉన్నారు. ధ్వజస్తంభం వద్ద వ్రతాలాచరించేందుకు రూ.1500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు కూడా ఇబ్బందులు తప్పలేదు.
స్వామి దర్శనానికి మూడు గంటలు
సత్యదేవుని దర్శనానికి మూడు గంటలు సమయం పట్టింది. స్వామివారి అంతరాలయం దర్శనం కోసం రూ.వంద టిక్కెట్ తీసుకున్న భక్తులు కూడా రెండు గంటలు వేచియుండాల్సి వచ్చింది. వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బంది పడ్డారు.
ఆలయానికి సుమారు ఎనిమిది వేల వాహనాలలో భక్తులు తరలివచ్చారు. పలుమార్లు ఘాట్‌రోడ్‌లో వాహనాలు నిలిచిపోయాయి. గతంలో భక్తుల రద్దీ ఉన్న సమయంలో చిన్న కార్లు, ఇతర వాహనాలను ప్రకాష్‌సదన్ వెనుక గల మైదానంలో నిలిపివేసేవారు. ఈ సారి వాహనాలను యథేచ్ఛగా వదిలేయడంతో కార్లను పశ్చిమ రాజగోపురం ముందు నిలిపివేశారు. అదే విధంగా ఆటోలను కూడా నిలిపివేయడంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు.
పాలకమండలి సమావేశంలో అధికారులు
సత్యదేవుని దర్శనానికి భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా అదే రోజు పాలక మండలి సమావేశం నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాలకమండలి సమావేశంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ దేవస్థానం చైర్మన్, సభ్యులు, ఇన్‌చార్జి ఈఓ, వివిద విభాగాల ఏఈఓలు, సూపరింటెండెంట్‌లు, ప్రధానార్చకుడు, అందరూ పాల్గొన్నారు. ఓ వైపు వేలాది మంది భక్తులు ఆలయప్రాంగణంలో ఇబ్బంది పడుతుంటే గుమస్తాలు, నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రమే వారికి సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇటువంటి రద్దీ రోజుల్లో మిగిలిన విభాగాల సిబ్బందికి కూడా ఆలయం వద్ద, వ్రత మండపాల వద్ద ప్రత్యేక డ్యూటీలు వేసేవారు. చైర్మన్, ఇన్‌చార్జి ఈఓ ఆలయ ప్రాంగణం అంతా తిరిగి సిబ్బందికి సూచనలిచ్చేవారు. ఈ సారి అందుకు విరుద్ధంగా అక్కడ విధుల్లో ఉండాల్సిన అధికారులు కూడా భక్తులను గాలికి వదిలేసి పాలక మండలి సేవలో తరించడం విశేషం
స్వామిని దర్శించిన 45 వేల మంది భక్తులు
సత్యదేవుని ఆలయానికి సుమారు 45 వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 4,185 జరగగా రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement