కుంటనక్కలు!
వజ్రకరూరులో వాటర్‌షెడ్‌లో అవినీతి బాగోతం
– చాలా చోట్ల ఫారంపాండ్స్ లేకుండానే బిల్లులు స్వాహా
– ఏడాదిన్నర వ్యవధిలో రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు
– పెద్ద పెద్ద గుంతలను ఫారంపాండ్స్‌గా చూపిన పరిస్థితి
– రూ.కోటికి పైగా నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు
– పనులు ప్రారంభించడం.. విలేయడం
కరువును చూసి మీరు పారిపోకూడదు. మిమ్మల్ని చూసి కరువే పారిపోవాలి. ప్రభుత్వం తరపున నీటి సంరక్షణ చర్యలు చేపట్టాం. వాటి ద్వారా వర్షం నీటిని ఒడిసి పట్టి భూగర్భజలాలు పెంపొందించుకోవాలి. సేద్యపు కుంటలతో సిరుల పంట పండాలి.
– రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలివి..
అధికారులను చూసి మీరు భయపడకూడదు. మమ్మల్ని చూస్తే వాళ్లకే వణుకు పుడుతుంది. ప్రభుత్వం తరపున చేపట్టే పనులన్నీ మేమే చేస్తాం. అవి ఉన్నా..లేకున్నా బిల్లులు మాత్రం చేయండి. ఆ తర్వాత మేం చూసుకుంటాం.
– ఇదీ తెలుగుదేశం పార్టీ నేతల తీరు..
అనంతపురం టౌన్/వజ్రకరూరు : భూగర్భ జలాలు వృద్ధి చెందాలంటే వర్షపు నీటిని ఒడిసి పట్టడమే ప్రత్యామ్నాయం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సేద్యపు కుంటల(ఫారంపాండ్స్) తవ్వకానికి చర్యలు చేపట్టింది. వజ్రకరూరు వాటర్‌షెడ్ పరిధిలో చేపట్టిన సేద్యపు కుంటల పనులు తెలుగుదేశం పార్టీ నేతలకు సిరుల పంట పండించాయి. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయడం.. పని ప్రారంభించి సగంలోనే నిలిపేసి నిధులు బొక్కేసిన వైనం వెలుగు చూస్తోంది. కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఫారంపాండ్స్‌కు రూ.కోటికి పైగా ఖర్చు చేశారు. పోనీ సేద్యపు కుంటలైనా ఉన్నాయా అంటే అదీ లేదు. అందినకాడికి దోచుకోవడమే పరమావధిగా అధికారులతో కలిసి అక్రమాలకు తెరతీశారు.
ఏడాదిన్నర వ్యవధిలో రూ.కోటికి పైగా ఖర్చు
2009–10లో మొదటి బ్యాచ్ కింద వజ్రకరూరు వాటర్‌షెడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి గత ఏడాది ప్రాజెక్ట్ కాల పరిమితి ముగిసే నాటికి 243 సేద్యపు కుంటలు తవ్వించి రూ.103.55 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పొందుపర్చారు. ఇందులో ఉపాధి హామీ నిధులు రూ.101.76 లక్షలు, వాటర్‌షెడ్ నిధులు రూ.1.80 లక్షలు వెచ్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత 2015 ఏప్రిల్ నుంచి (2016 సెప్టెంబర్‌లో ప్రాజెక్ట్ ముగిసింది) ఏకంగా 232 ఫారంపాండ్స్ నిర్మించి రూ.101.83 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. రాగులపాడులో 113 ఫారంపాండ్స్‌కి రూ.104.67 లక్షలకు పరిపాలన అనుమతి రాగా.. 113 పనులు చేసి రూ.50.33 లక్షలు ఖర్చు చేశారు.
వజ్రకరూరు అవినీతి బాగోతం
ప్రాంతం ఫారంపాండ్స్ అనుమతి వ్యయం(రూ.లక్షల్లో) నిర్మాణం వ్యయం(రూ.లక్షల్లో)
తట్రకల్లు 35 32.66 35 17.86 లక్షలు
వజ్రకరూరు 42 32.42 41 13.83
బోడిసానిపల్లి 6 5.04 6 1.68
గంజికుంట 47 48.11 47 19.82
ఎన్‌ఎన్‌పీ తండా 1 రూ.3వేలు
అన్నీ అవినీతి ‘లెక్కలే’..
సేద్యపు కుంటల నిర్మాణానికి వెచ్చించిన నిధుల తీరు ఒక్కసారి పరిశీలిస్తే అవినీతి ‘లెక్క’ ఇట్టే అర్థమవుతుంది. వాటర్‌షెడ్ పరిధిలోని గ్రామాల్లో ఉపాధి హామీ కింద మొత్తం 242 ఫారంపాండ్స్‌కు గాను రూ.222.35 లక్షలకు, ఐడబ్ల్యూఎంపీ కింద రెండు ఫారంపాడ్స్‌కు రూ.76 వేలతో పరిపాలన అనుమతి వచ్చింది. మంజూరైన (242) పనులన్నీ ప్రారంభించిన అధికారులు రూ.కోటికి పైగా ఖర్చు చేశారు. కానీ చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి కాలేదు. కొన్ని చోట్ల అసలు సేద్యపు కుంటల ఆనవాళ్లే కనుమరుగయ్యాయి. విచిత్రంగా చిన్నపాటి గుంతలను తవ్వి వాటినే ఫారంపాండ్స్‌గా చూపి బిల్లు చేసుకున్నారు. అధికార పార్టీ నేతల అండతో డ్వామా అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారనే విషయం స్పష్టమవుతోంది.
నిబంధనల మేరకు ఈ పనులన్నీ కూలీలతో చేయించాలి. కానీ ఇక్కడ యంత్రాలతో తూతూ మంత్రంగా చేపట్టి నిధులు బొక్కేశారు. పెద్ద పెద్ద గుంతలను ఫారంపాండ్స్‌గా చూపారు. కొన్ని ఫారంపాండ్స్ ఇప్పటికే పూడిపోయాయి. తట్రకల్లు సమీపంలోని వంకలో నిబంధనలకు విరుద్ధంగా ఫారంపాండ్ పనులు చేపట్టారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన కొందరు నాయకులు ఆ భూములను సాగు చేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ తవ్విన ఫారంపాండ్లను పూడ్చివేశారు. తట్రకల్లులో ఓబన్న, బోయ ఆంజనేయస్వామి, శ్రీనివాసులు పొలాల వద్ద నిర్మించిన సేద్యపు కుంటలు ప్రస్తుతం పూడిపోయాయి. ఇలా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.