కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్ పట్టణంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మురికి కాలువలు చెత్తా, చెదారంతో నిండిపోవడంతో మురికి నీరు, వరద నీరంతా రహదారులపై నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు దుకాణాలు, ఇళ్ళలోకి వరదనీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ ఆవరణలోని మురికి కాలువ మట్టితో పూర్తిగా కూరుకుపోవడంతో బస్టాండ్ ఆవరణంతా సేలయేరుగా మారింది. హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేన్లు, వరిపొలాలు నీటితో నిండాయి. శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో వ్యవసాయ బావి తవ్వుతున్న కూలీలు వర్షం రావడంతో చెట్టుకిందకు చేరారు. వీరిపై పడుగు పడింది. మేడిచెల్మల రాజయ్య(35) మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అత్యధికంగా కేశవపట్నం మండలంలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కమలాపూర్‌లో 8.4, ఎల్కతుర్తిలో 2.2, బెజ్జంకిలో 4.8, కోహెడలో 6.3, హుస్నాబాద్‌లో 4.8, సైదాపూర్‌లో 3.6, గంగాధరలో 2.7, చిగురుమామిడిలో 3.2, రామడుగులో 2.9, మల్లాపూర్‌లో 2.6, కోరుట్లలో 2.2, మేడిపల్లిలో 2.2, ముస్తాబాద్‌లో 4.2, వేములవాడలో 2.1, బోయినిపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన మండలాల్లో ముసురువర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.