నేడు, రేపు వానగండం
విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు వానముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి మంగళవారం శ్రీలంకకు సమీపంలో స్థిరంగా కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఫలితంగా బుధ, గురువారాల్లో కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోను, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లోను అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదిలాఉండగా గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లా తడ, చిత్తూరు జిల్లా సత్యవేడుల్లో 13 సెం.మీల భారీ వర్షపాతం నమోదైంది. వెంకటగిరి, పుత్తూరుల్లో 11, శ్రీకాళహస్తిలో 10, తొట్టంబేడులో 9, నగరిలో 8, కోడూరు, తిరుపతి, అనంతరాజుపేటల్లో 7, సూళ్లూరుపేటలో 6, పాలసముద్రం, పెనగలూరు, గూడూరు, రాపూరుల్లో 5, కావలి, నెల్లూరు, చిత్తూరు, పలమనేరు, అట్లూరుల్లో 4, ఆత్మకూరు, వింజమూరు, కుప్పం, పుల్లంపేట, బద్వేలు, శాంతిపురం, పాకాలలో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.