
తాటిచెట్టే ఆధారంగా మృత్యువుతో పోరాటం
- సాహసం చేసి కాపాడిన గ్రామ యువకులు
చిలకలూరిపేట రూరల్: వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడు అందుబాటులోని తాటి చెట్టును ఆధారంగా చేసుకొని 8 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గంగన్న పాలెంలో గురువారం చోటు చేసుకుంది. వరద ధాటికి కోమటినేనివారిపాలెం ఎత్తిపోతల పథకంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న చేవూరి కొండలు కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. కొండలు కుమారుడు వెంకటేశ్ గ్రామస్తుల సహాయంతో క్షేమంగా బయటపడ్డాడు.
వాగు సమీపంలోనే ఎత్తిపోతల వద్ద ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులు ఏర్పాటుచేసిన ప్రహరీ నీటి ప్రవాహానికి కొట్టుకుని రావడంతో కొండలు కుమారుడు వెంకటేశ్, సోదరుడి కుమార్తె వనజలను రెండు భుజాలపైకి ఎత్తుకుని, భార్య సుబ్బులును చేతితో పట్టుకుని రోడ్డుపైకి చేరేందుకు ప్రయత్నించాడు. నీటి ఉధృతికి నలుగురూ కొట్టుకుపోయారు. బ్రిడ్జికి కిలోమీటరు దూరంలో వెంకటేశ్ ఓ తాటిచెట్టును పట్టుకుని వేలాడడాన్ని చూసిన సమీప బంధువు పోలయ్య అతన్ని కాపాడేందుకు వెళ్లి చిక్కుకుపోయాడు. హెలికాప్టర్ నుంచి సాయం వస్తుందని ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. చివరికి గ్రామస్తులు తాళ్లు పట్టుకొని వారిద్దరినీ బయటికి తీసుకొచ్చారు.