హీరాలాల్‌ ఇక లేరు | heeralal no more | Sakshi
Sakshi News home page

హీరాలాల్‌ ఇక లేరు

Published Sun, Aug 14 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

హీరాలాల్‌ ఇక లేరు

హీరాలాల్‌ ఇక లేరు

–గుండెపోటుతో కర్నూలు సాహితీ దిగ్గజం  ఆకస్మిక మృతి 
–ఉద్యమశీలిగా, సజనశీలిగా రాష్ట్రంలోని తెలుగు రచయితలందరికీ హీరాలాల్‌ చిరపరిచితుడు 
– పలువురు సంతాపం
 
కర్నూలు(కల్చరల్‌):
కర్నూలు నగరంలో ఎక్కడ సాహితీ సభ జరిగినా, కవి సమ్మేళనం జరిగినా, రచయితల సదస్సు జరిగినా ఆ గొంతు ఖచ్చితంగా వినిపించేది. ప్రాచీన తెలుగు సాహిత్యం గురించి, తెలుగు భాష సౌందర్యం గురించి, కర్నూలు జిల్లా చరిత్ర గురించి ఆ గొంతు ఘంటాపదంగా పలికేది. నడవడం చేతకాకపోయినా ఎవరి సహాయం తీసుకోకుండానే  సాహితీ సభలకు ప్రత్యక్షమైన మహా సాహితీ పిపాసి ఆయన. ఖంగుమనే గొంతుతో చెప్పాలనుకున్న అంశాన్ని ధీటుగా, స్పష్టంగా తెలియజేస్తూ కర్నూలు తెలుగు సాహిత్యానికి తొలి చిరునామాగా నిలిచిన హీరాలాల్‌ ఇక లేరు. హిందీ ఉపాధ్యాయుడుగా, కర్నూలు జిల్లా తెలుగు రచయితల వ్యవస్థాపకుడిగా, అలనాటి చరిత్ర పరిశోధకుడుగా విశిష్టమైన సేవలందించిన హీరాలాల్‌ శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు.  ఈయన తుదిశ్వాస వరకు తెలుగు పలుకులనే శ్వాసిస్తూ  తెలుగు వచన కావ్యానికి, పద్యకావ్యానికి ఉద్యమశీలిగా, సజనశీలిగా రాష్ట్రంలోని తెలుగు రచయితలందరికీ హీరాలాల్‌ చిరపరిచితుడు. 1970లో కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘాన్ని స్థాపించి రోశయ్య, గన్నమరాజు సాయిబాబాలతో కలసి సాహిత్య సేద్యాన్ని సాగించారు. తెలుగు సాహిత్యంలో హేమాహేమీలైన కవి పండితులను కర్నూలుకు పిలిపించారు. దివాకర్ల వెంకటావధాని, దాశరథి, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి వంటి లబ్ధప్రతిష్టులైన కవులతో ఉపన్యాసాలను ఇప్పించిన ఘనత హీరాలాల్‌ది.  అంతటి గొప్పవ్యక్తి ఇక లేరన్న వార్త కర్నూలు వాసులకు అశనిపాతంలా పాకింది.
 
ఆయన లేని లోటు తీరనిది.. 
చైతన్య రవళి, పరంజ్యోతులు, వ్యాస మణిమంజరి వంటి సంకలనాలను ప్రచురించిన హీరాలాల్‌ మతి తీరని లోటని కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం గన్నమరాజు సాయిబాబా తెలిపారు. స్థానిక బండిమెట్టలోని హీరాలాల్‌ స్వగహంలో శనివారం మధ్యాహ్నం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన సాయిబాబా హీరాలాల్‌ సేవలను కొనియాడారు. ఆయన మతిపై రచయితలు కె.ఎన్‌.ఎస్‌.రాజు, ఎస్‌.డి.వి.అజీజ్, జె.ఎస్‌.ఆర్‌.కె.శర్మ, యలమర్తి రమణయ్య, ఇనాయతుల్లా, జంద్యాల రఘుబాబు, హరికిషన్, తెలుగు కళాస్రవంతి అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.పి.ఎం.రెడ్డి, లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ఉస్మానియా కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్‌ మండి అన్వర్‌ హుస్సేన్‌ తదితరులు తీవ్ర సంతాపం ప్రకటించారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement