రెహమాన్‌కి గ్రాండ్ ప్రైజ్
‘రోజా’ నుంచి ప్రస్తుతం చేస్తున్న ‘2.0’ వరకూ ఎ.ఆర్. రెహమాన్ తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్... ఇలా అన్ని భాషలవారికీ వీనుల విందైన పాటలిచ్చారు. ఈ సంగీత సంచలనం పలు దేశీ అవార్డులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందరూ చెప్పుకునే ఆస్కార్, గ్రామీ వంటి ప్రతిష్ఠాత్మక విదేశీ అవార్డులు కూడా అందుకున్నారు.
తాజాగా, మరో అరుదైన అవార్డుని సొంతం చేసుకున్నారు. జపాన్ ప్రభుత్వం అందించే గ్రాండ్ ఫ్యూకూవోకా అవార్డు రెహమాన్‌ని వరించింది. తన సంగీతం ద్వారా ఆసియా దేశాల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినందుకు రెహమాన్‌ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఇప్పటివరకూ ఈ అవార్డును అందుకున్న భారతీయుల్లో సితార్ విద్వాంసులు పండిట్ రవిశంకర్, నర్తకి పద్మా సుబ్రహ్మణ్యం, సరోద్ విద్వాంసులు అంజాద్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. మామూలుగా ఫ్యుకూవోకా అవార్డుకి మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి గ్రాండ్ ప్రైజ్, రెండోది అకాడమిక్ ప్రైజ్, మూడోది కల్చర్ ప్రైజ్. మన రెహమాన్‌కి వచ్చింది గ్రాండ్ ప్రైజ్.