హిందీ-తెలుగు భాషల స్వర్ణసేతువు
సందర్భం
తెలుగువారికి చెందిన ఏ విషయమైనా హిందీలోకి అనువదిస్తే తప్ప మన విశిష్టత హిందీ వారికి తెలియదని, అట్లే హిందీ సాహిత్యం, సంస్కృతి తెలియకపోతే మన విజ్ఞానం పరిమి తమే అవుతుందని భావించిన యార్లగడ్డ రెండుభాషల్లో 64 గ్రంథాలను వెలువరించారు.
నిత్య అధ్యయన శీలి, నిరంతర కార్యశీలి, నిబద్ధత గల భాషా సేవ కుడు, లక్ష్య సాధకుడు, తెలుగు భాషా సంస్కృతుల ఉద్దీపనకు చైతన్య దీప్తి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. తెలుగు-హిందీ భాషలు ఆయనకు ఉఛ్వాస నిశ్వాసలు. అందుకే హిందీ- తెలుగు భాషల స్వర్ణసేతువు యార్లగడ్డ అని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి 20 ఏళ్లక్రితమే అన్నారు. పార్లమెంటులో స్వచ్ఛమైన హిందీలో యార్లగడ్డ అనర్గళంగా ప్రసంగిస్తూంటే హిందీ ప్రాంతీయులైన పార్లమెంటు సభ్యులు ఆశ్చర్యంతో ఆలకిస్తూ ఉండేవారు. 30 మంది ఎంపీలతో కూడిన పార్లమెంటరీ అధికార భాషా సంఘంలో ఆ కమిటీకి యార్ల గడ్డ నాయకత్వం వహించటమే కాకుండా నాలుగేళ్లపాటు దేశవ్యాప్తంగా పర్యటించి వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాల యాల్లో రాజభాష హిందీ వినియోగాన్ని సమీక్షించడం దగ్గరగా చూసిన సి.నా.రె. ‘మన తెలుగువాడు హిందీ మీద పెత్తనం వహిస్తున్నాడ’ని ఆనందపడేవారు.
దేశంలోని అధికారభాషా చట్టాలు, వాటికి సంబంధిం చిన నియమ నిబంధనలపై యార్లగడ్డకు గల పరిజ్ఞానం, అవగాహన అధికం. అందుకే ప్రధానమంత్రి అధ్యక్షులుగా, హోంమంత్రి ఉపాధ్యక్షులుగా, 6గురు సీనియర్ కేంద్ర మంత్రులు, 6గురు వివిధ రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న కేంద్రీయ హిందీ సమితిలో యార్లగడ్డ ఒక్కరే 25 ఏళ్లుగా అప్రతిహతంగా సభ్యులుగా కొనసాగుతున్నారు. కేంద్రంలోని కీలకమైన మంత్రిత్వ శాఖలకు హిందీ సలహా సంఘ సభ్యులుగా యార్లగడ్డ నేటికీ సలహాలు ఇస్తున్నారు.
హిందీ-తెలుగు భాషల మధ్య ఆదాన ప్రదానాల్లో స్పెషలిస్టు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తెలుగువారికి చెందిన ఏ విషయమైనా హిందీలోకి అనువదిస్తే తప్ప మన జాతి వైశిష్ట్యం హిందీవారికి తెలియదని, అలాగే హిందీ సాహి త్యం, సంస్కృతి మన తెలుగువారికి తెలియకపోతే మన విజ్ఞానం పరిమితమే అవుతుందని భావించిన యార్లగడ్డ హిందీలోంచి తెలుగులోకి, తెలుగునుంచి హిందీలోకి 64 గ్రంథాలను వెలువరించారు. ఎందరో సహచరుల్ని, విద్యా ర్థుల్ని ఈ ఆదాన్-ప్రదాన్ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. ఆయన సంకల్ప శుద్ధితోనే గత రెండు- మూడు దశాబ్దాలుగా వందలాది విలువైన గ్రంథాలు రెండు భాషల్లోకి పరస్పరం అనువాదమయ్యాయి.
ఆదాన ప్రదానాలు ధ్యేయంగా ఆయన చేసిన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది తెలుగులో ‘హిందీ సాహిత్య చరిత్ర’ రచన. 12 ఏళ్లు శ్రమించి హిందీ సాహిత్య చరిత్రను తెలుగువారికి అందించారు. ఈ రచనకు బహుభాషావేత్త, మన పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు 29 పేజీల ముం దుమాట రాయటమే కాకుండా ఆ గ్రంథ ఆవిష్కరణ సభకు స్వయంగా విశాఖపట్నం వచ్చి స్వహస్తాలతో గ్రంథాన్ని ఆవిష్కరించడమే కాక, యార్లగడ్డ చేసిన అద్వితీయ కృషిని పదే పదే అభినందించారు.
తను చేసిన మరొక అపురూప మైన అనువాద రచన.. ప్రసిద్ధ హిందీకవి హరివంశరాయ్ బచ్చన్ ఆత్మకథను తెనుగించడం. బచ్చన్ హిందీలో 4 భాగాలుగా రాసుకున్న బృహత్ ఆత్మకథను యార్లగడ్డ ఒకే పెద్ద గ్రంథంగా ప్రచురించారు. హైదరాబాద్‌లోని వైశ్రాయ్ హోటల్‌లో జరిగిన ఈ గ్రంథ ఆవిష్కరణకు హరివంశరాయ్ బచ్చన్ కుమారుడు, ప్రముఖ హిందీ సినీ నటుడు అమి తాబ్ బచ్చన్ కుటుంబ సమేతంగా హాజరై తన తండ్రి ఆత్మకథను తెలుగుప్రజలకు అందించడంలో మహత్తరకృషి చేసిన యార్లగడ్డను అభినందనలతో ముంచెత్తారు.
మహనీయులు, దేశనేతలు, ఉద్యమనేతల జీవిత చరిత్రలను, ఆత్మకథలను రచించడం, అనువదించడం, తమస్ వంటి సంచలన రచనలను సత్వరమే అనువదించి ప్రచురించడం, హిందీ-తెలుగు భాషల్లో ఉత్తమోత్తమ రచన ల్ని అనువదించడంతోపాటు యార్లగడ్డ సాహిత్య ప్రయా ణం ‘ద్రౌపది’, ‘సత్యభామ’ వంటి సృజనాత్మక రచనల దిశ గా కూడా సాగి ఇరుభాషల పాఠకుల మన్ననలు అందుకుం ది. పలు దేశాల్లో పర్యటించి అంతర్జాతీయ అవగాహనను పెంచుకున్నారు. కెనడాలో భారత సాంస్కృతిక రాయబారి గా నియమితులయ్యారు.
ఈక్రమంలోనే మాస్కోలోని ‘భారత్ మిత్ర సమాజ్’ ప్రసిద్ధ రష్యన్ కవి పుష్కిన్ పేరుతో భారతీయ హిందీ కవి లేదా రచయితకు ఇచ్చే వార్షిక పురస్కారం 2007లో యార్లగడ్డను వరించింది. నాగపూ ర్‌లో 1975లో జరిగిన మొదటి సమ్మేళనం మినహా, ఇప్పటి వరకు జరిగిన ఇతర 9 విశ్వ హిందీ సమ్మేళనాల్లో పాల్గొని ప్రముఖ భూమికను నిర్వహించిన ఏకైక వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. దక్షిణాఫ్రికాలో జరిగిన 9వ సమ్మేళనంలో ‘విశ్వ హిందీ సమ్మాన్’ పురస్కారం అందు కున్నారు.
ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షులుగా యార్లగడ్డ హిందీ-తెలుగు సాహిత్యాలకు చేసిన సేవ అపారం. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనను హిందీ అకాడమీ సభ్యునిగా చేస్తే, తదనంతరం 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హిందీ అకాడమీని పునఃప్రారంభించి ఆయనను అధ్యక్షుణ్ని చేశారు. ఏపీలో వందేళ్లుగా సాగుతున్న హిందీ ప్రచారం ఉద్యమ చరిత్రను శోధింపజేసి ఆ పత్రాలను ఆంధ్రప్రదేశ్‌లో హిందీ ప్రచారోద్యమ చరిత్ర అనే గ్రంథంగా హిందీలో ప్రచురించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో హిందీ సాహిత్య వికాస చరిత్ర గ్రంథాన్ని కూడా ప్రచురించి రాష్ట్రంలో హిందీ భాషాభివృద్ధి, సాహిత్య రచనకు సంబంధించిన సమగ్ర చరిత్రను అందుబాటులోకి తెచ్చే మహత్తర కృషి చేశారు. హిందీ అకాడమీ అధ్యక్షులుగా ఉన్న ఆరేళ్ల కాలంలో తెలుగు భాషాసాహిత్య, సంస్కృతు లను ప్రతిబింబించే వంద గ్రంథాలను హిందీలోకి అనువదించి తెలుగుకు దేశవ్యాప్త గౌరవం కలిగించారు. యార్లగడ్డ కృషి ఫలితంగా భారత ప్రభుత్వ నిధులతో అద్భుతమైన రాజభాషా భవన్ నిర్మితమైంది. విశాఖలోని ఈ భవన్ దేశంలోనే మొట్టమొదటిది చివరిది కూడా.
హిందీ-తెలుగు భాషలు రెండింటిలో పరిశోధన చేసి పిహెచ్.డి పట్టాలు పొందారు. తెలుగు నాట హిందీ ప్రచారం, సాహిత్య రచనలో కృషికి గాను రాష్ట్రపతి చేతులమీదుగా గంగాశరణ్ సింహ్ పురస్కారం అందుకున్నారు. 2003లో తన 50వ ఏట నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ‘హిందీ’ మనిషిగా ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేయడం తెలుగువారందరికీ గర్వకారణం. హిందీ భాషా సేవలో జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కి అభినందనలు, శుభాకాంక్షలు.
(నేడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్న సందర్భంగా)
డాక్టర్ వెన్నా వల్లభరావు
వ్యాసకర్త విశ్రాంత హిందీ అధ్యాపకులు, ఆంధ్ర లయోల కళాశాల, విజయవాడ. మొబైల్‌ః 9490337978