జోగిపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, కూలిపోయిన ఇళ్ల బాధితులకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యదర్శి బి.సంజీవరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జోగిపేటలో విలేకరులతో మాట్లాడారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా రైతులు, ప్రజలు నష్టపోయారన్నారు.
సింగూరు ప్రాజెక్టులోని వరద నీటిని మంజీర నదిలోకి వదలడంతో పొలాలన్నీ నీట మునిగాయన్నారు. మిన్పూర్, ఇసోజిపేట గ్రామాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాయికోడ్, రేగోడ్, మునిపల్లి మండలాల్లో భారీగా నష్టం జరిగిందన్నారు. రాయికోడ్, సింగితం, జర్ని చెరువులు తెగిపోయి వేల ఎకరాల పంటలు నేలకు ఒరిగాయన్నారు.
నష్టంపై అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. చెరువుల్లో నీటి మట్టం పెరిగినందున ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచాలన్నారు. బతుకమ్మ పేరుతో ప్రభుత్వం విడుదల చేస్తున్న రూ.15 కోట్లు కేవలం తన కూతురు కవిత కోసమే అన్నారు. ఆ నిధులతో పేదలకు సౌకర్యాలను కల్పించొచ్చన్నారు. రాష్ర్టంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.