దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్న నీటి పారుదల శాఖ
2013 చట్టం ప్రకారమే నోటిఫికేషన్, భూసేకరణ జరుగుతోందని వెల్లడి
సవరణ బిల్లు ఆమోదం పొందితే
123 జీవో కింద సేకరణ అధికారికం అవుతుందని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం జీవో 123 కింద భూసేకరణ చేపట్టవద్దంటూ హైకోర్టు ఇచ్చిన స్టేతో ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులు కోరుకున్నట్లుగా భూసేకరణ చేస్తున్నందున.. కోర్టు ఉత్తర్వులపై మళ్లీ అప్పీలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని భావిస్తోంది. భూసేకరణ చట్టం–2013 ప్రకారమే ప్రస్తుతం నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు, భూసేకరణ జరుగుతోందని... జీవో 123 కింద సేకరించిన భూమి సైతం భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందితే అధికారికం అవుతుందని పేర్కొంటోంది.
భారీగా భూసేకరణ: రాష్ట్రంలో మొత్తంగా 3.2 లక్షల ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, అందులో ఇప్పటికే 2.12 లక్షల ఎకరాల సేకరణ పూర్తయింది. ఇందులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 63 వేల ఎకరాల మేర సేకరించగా.. దీనిలో 47 వేల ఎకరాలు 123 జీవో కింద, 16 వేల ఎకరాలు భూసేకరణ చట్టం ప్రకారం తీసుకున్నారు. ఇంకా ప్రధాన ప్రాజెక్టుల పరంగా చూస్తే కాళేశ్వరం పరిధిలో 45 వేల ఎకరాలు, పాలమూరు కింద 13 వేల ఎకరాలు, దేవాదుల కింద 7 వేల ఎకరాల మేర సేకరించాల్సి ఉంది.
అయితే చాలా చోట్ల ప్రభుత్వం సంబంధిత నిర్వాసితులతో నేరుగా మాట్లాడి, ఒప్పించి 123 జీవో మేరకు భూసేకరణ జరుపుతోంది. ఆయా చోట్ల మార్కెట్ ధరల ప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అందిస్తోంది. అయితే ఆ ధర తమకు సరిపోదని.. చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరిన చోట ఆ విధంగా భూసేకరణ జరుపుతోంది, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో 13 వేల ఎకరాల మేర సేకరించగా.. వేములఘాట్ గ్రామ పరిధిలో 1,300 ఎకరాలు భూసేకరణ చట్ట ప్రకారమే చేస్తోంది. పాలమూరులోని పలు గ్రామాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రభావం సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై ఏమాత్రం ఉండబోదని నీటి పారుదల శాఖ పేర్కొంటోంది. ఇక ఇప్పటికే 123 జీవో కింద సేకరించిన భూమి సైతం సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే.. చట్ట ప్రకారం సేకరించినట్లు అవుతుందని చెబుతోంది. ‘‘కోర్టు తీర్పుతో ప్రాజెక్టుల్లో భూసేకరణ ఎక్కడా ఆగిపోదు. చట్ట ప్రకారం భూసేకరణ జరుగుతుంది. కాబట్టి కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోవాల్సిన అవసరం సైతం లేదు.’’అని ఉన్నత స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు.
123 జీవోపై స్టేతో నష్టం లేదు!
Published Fri, Jan 6 2017 4:11 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement