ఏలూరు : ఇందుమతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఎదుట ఇందుమతి మృతదేహంతో వారు ఆందోళనకు దిగారు. ఇందుమతి మరణానికి కారకులైన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వారు ఆరోపించారు.
అంతలో రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి... ఇందుమతి తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఇందుమతి బంధువులు, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు ఆమెను అడ్డుకున్నారు. ప్రభుత్వపరంగా మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కేసు విచారణలో ఉందని... పోలీసులు తమ పని తాము చేసుకుని పోతారంటూ నన్నపనేని చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఇందుమతి తల్లిదండ్రులను పరామర్శించకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.