నల్లగొండ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిపోలో పని చేస్తున్న సెక్యూరిటీ ఎస్సై ... బస్సు డ్రైవర్‌లతో అనుచితంగా ప్రవర్తించడానికి నిరసనగా కార్మికులు శుక్రవారం అర్థరాత్రి విధులు బహిష్కరించి.. డిపో ఎదుట ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ ఎస్సై దామోదర్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్‌లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని ఆరోపించారు.
దీంతో ఆగ్రహించిన కార్మికులు తమకు బ్రీత్ ఎన్‌లైజర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించినా.. సేవించకపోయినా.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు బ్రిత్ ఎన్‌లైజర్ సూచిస్తోంది. దీంతో ఆర్టీసీలోని అన్ని సంఘాల కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
దాంతో కార్మికులు విధులను బహిష్కరించి డిపో ఎదుట బైఠాయించారు. తెల్లవారుజాము నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము తప్పు చేసినట్లు రుజువు అయితే మెడికల్‌కు పంపించి సస్పెండ్ చేయండి తప్పా.. అనవసరంగా నిందలు వేయడం తగదని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.