హిట్లరూ.. ప్రేమించాడు! | Hitler’s first love was a Jewish girl | Sakshi
Sakshi News home page

హిట్లరూ.. ప్రేమించాడు!

Published Sat, Feb 13 2016 11:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

హిట్లరూ.. ప్రేమించాడు!

హిట్లరూ.. ప్రేమించాడు!

‘‘ఆ అమ్మాయి అందంగా ఉంది కదూ’’ అన్నాడు హిట్లర్. అవును హిట్లరే! తన పిచ్చి కోసం లక్షల ప్రాణాలను గాల్లో కలిపేసిన హిట్లర్. యూదులను మృత్యుకుహరంలోకి నెట్టి పైశాచికానందాన్ని అనుభవించిన హిట్లర్. ముక్కుపచ్చలారని చిన్నారులను ఇరుకుగదుల్లో బంధించి, వారిని పీనుగులుగా మార్చిన హిట్లర్. రాజ్యకాంక్షతో ఆల్ఫ్స్ పర్వత మంచు శిఖరాలపై రక్తపుటేరులు పారించిన హిట్లర్..! నిజమే..అతని అణువణువూ ద్వేషంతోనే నిండిపోయింది. అందులో వేరే ఏ ఉద్వేగానికీ చోటు లేదు. మరి, ప్రేమకు..?!
 
1905 వసంతకాలం.. ఆస్ట్రియాలోని లింజ్ నగరం.. క్లాసులు ముగించుకుని స్కూలు వెలుపలికి వచ్చాడు పదహారేళ్ల హిట్లర్. పక్కనే తోడుగా నడుస్తున్నాడు అగస్ట్ కుబిజెక్. ఇద్దరికీ ఓ సంగీతశాలలో పరిచయం. ఆ పరిచయమే స్నేహంగా మారింది. ఎంతటి స్నేహమంటే.. ఇద్దరికీ వేరే స్నేహితులే లేనంతగా! హిట్లర్ తన మనసులోని భావాలన్నిటినీ కుబిజెక్‌తో మాత్రమే పంచుకునేవాడు. ఇది కూడా వారి స్నేహబంధం బలపడడానికి కారణమేనేమో!
 
ఆరోజు కూడా హిట్లర్ ఉన్నట్టుండి కుబిజెక్ చేతిని బలంగా పట్టుకున్నాడు. ‘‘ఆ అమ్మాయి అందంగా ఉంది కదూ’’ అన్నాడు. పరధ్యానంలో ఉన్నాడు కుబిజెక్. ‘‘రేయ్ నిన్నే! ఆ రాగి జుత్తు అమ్మాయి అందంగా ఉంది కదూ’’ రెట్టించిన ఉత్సాహంతో అడిగాడు హిట్లర్. అవునన్నట్టు తలూపాడు కుబిజెక్. ‘‘నీకీ విషయం చెప్పితీరాలి. నేనా అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పీకలదాకా ఆమె ప్రేమలో మునిగిపోయాను’’ నెమ్మదస్తుడిగా ఉండే హిట్లర్ నుంచి ఎప్పుడూ ఊహించని మాటలు వింటున్నాడు కుబిజెక్. హిట్లర్ తనతో మాత్రమే నొక్కిమరీ ఈ ప్రేమ విషయం ఎందుకు చెప్పాడో కూడా అతడికి అర్థమైంది. అవును.. వీరిద్దరూ తొలిసారిగా కలుసుకున్నప్పుడే పోటీ పడ్డారు, సంగీతశాలలో స్థానం కోసం. తర్వాతి నుంచి ప్రతి విషయంలోనూ పోటీనే. అందుకే, ముందు జాగ్రత్తగా కాబోలు.. కుబిజెక్‌తో తన ప్రేమ విషయం చెప్పేశాడు.
 
ఆ రోజు నుంచి ప్రతి సాయంత్రం హిట్లర్‌కీ అతడి మిత్రుడికీ ఒకటే పని.. లింజ్ వీధుల్లో ఆమె కోసం ఎదురు చూడటం! అత్యంత సౌందర్యవతి అయిన ఆ అమ్మాయి పేరేంటో కూడా వీరికి తెలీదు. నీలిరంగు కళ్లు, రాగి దారాలతో ఒత్తుగా అల్లినట్టుండే జుత్తు, మల్లెతీగ లాంటి సన్నని నడుము, సోయగాలు ఉట్టిపడే నాజూకు నడక తప్ప ఆమె గురించి వీరికేమీ తెలీదు. ఆమె కళ్లను చూస్తూనే పరవశించిపోయేవాడు హిట్లర్. అది కూడా దూరం నుంచే..!
 
మిత్రుడి కోసం ఓరోజు బోలెడంత సమాచారం మోసుకొచ్చాడు కుబిజెక్. ‘‘వాళ్లు మనకంటే బాగా డబ్బున్నవాళ్లు. సమాజంలో పేరున్నవాళ్లు. ఆ అమ్మాయి ఈ మధ్యే మ్యూనిచ్, జెనీవాల్లో చదువు పూర్తి చేసుకుని వచ్చింది. బహుశా నీకంటే రెండేళ్లు పెద్దది కావొచ్చు. చెప్పడం మర్చిపోయా.. ఆమె పేరు స్టెఫానీ. స్టెఫానీ ఐజక్!’’ హిట్లర్‌తో చెబుతున్నాడు. ఐజక్ అనగానే హిట్లర్ ఎలా స్పందిస్తాడో చూద్దామనుకున్నాడు. ‘‘అంటే.. ఆమె యూదుల అమ్మాయా?’’ అడిగాడు హిట్లర్. అవునన్నట్టు తలూపాడు కుబిజెక్. ‘‘ఏదేమైనా.. ఆ అమ్మాయి నా కోసమే పుట్టింది. నేను జీవించేది ఆమె అనుగ్రహం కోసమే’’ కుండబద్దలు కొట్టాడు హిట్లర్.
 
 తన తల్లి చేతిలో చేయి వేసుకుని విహారానికి వచ్చే ఆ దేవకన్య కోసం హిట్లర్ వేచిచూడని సాయంత్రాలు లేవు. అలా అని ఒక్క హిట్లరే కాదు. ఆ వీధిలోని కుర్రాళ్లందరిదీ అదే పరిస్థితి. ఏ పూటకి ఆ పూట ఆమె చిరునవ్వు గెలుచుకుంటే చాలు అనుకునేవాడు హిట్లర్. అయితే, అదేమంత సులభంగా జరగలేదు. కొన్ని నెలల నిరీక్షణ తర్వాతే ఆమె దృష్టిలో పడ్డాడీ యువ ప్రేమికుడు. తనను దూరం నుంచే కన్నార్పక చూసే మధ్యతరగతి కుర్రాడి వైపు ఓ అరనవ్వు విసిరేదామె. ఆ మాత్రానికే ప్రపంచాన్ని జయించినంతగా సంబరపడేవాడు హిట్లర్. ఆమె నవ్వని రోజు అతడికి ప్రళయమే. తనను తాను హింసించుకునేవాడు. అతడి కళ్లు ఎరుపురంగులోకి మారిపోయేవి. 
ప్రపంచాన్నే నాశనం చేస్తాడేమో అన్నంత పిచ్చిగా ప్రవర్తించేవాడు.అయితే, హిట్లర్ ఏనాడూ స్టెఫానీతో మాట్లాడలేదు. మాట్లాడేందుకు ప్రయత్నించలేదు కూడా! ఎప్పుడైనా కుబిజెక్ ప్రోత్సహిస్తే.. ‘‘రేపు తప్పకుండా మాట్లాడతా’’ అంటూ తప్పించుకునేవాడు. అవును మరి, ఆమెను అల్లంత దూరాన చూస్తేనే అతడి గొంతు వణుకుతుంది. ఇక, దగ్గరకెళ్తే మాటేం పెగులుతుంది..? అయితే, చురుకైన ఆస్ట్రియన్ మిలటరీ అధికారులు ఆమెతో మాటకలిపేందుకు వెనకాడేవారు కాదు. స్టెఫానీ కూడా అందరితోనూ కలివిడిగా ఉండేది. ఇదంతా హిట్లర్‌కు నచ్చేది కాదు. కానీ, యువ మిలటరీ జనరల్స్‌ను అతడేం చేయగలడు? అందుకే వారిని దూరం నుంచే తిట్టుకునేవాడు. అసహ్యించుకునేవాడు.
 
హిట్లర్ తన తల్లిని చూసేందుకు వెళ్లినప్పుడు కూడా స్టెఫానీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. ఓ రోజు కుబిజెక్ నుంచి లేఖ అందుకున్నాడు. ‘‘స్టెఫానీకి డ్యాన్స్ అంటే పిచ్చి. ఆమె ప్రస్తుతం డ్యాన్స్ క్లాసులకు హాజరవుతోంది’’ అన్నది అందులోని సారాంశం. డ్యాన్స్ అంటే హిట్లర్‌కు గిట్టదు. వెంటనే కుబిజెక్ లేఖకు ఇలా జవాబు రాశాడు.. ‘‘స్టెఫానీకి డ్యాన్స్ అంటే ఇష్టమని నేననుకోను. బహుశా ఈ సమాజం కోసమే ఆమె నేర్చుకుంటోందేమో! ఒకసారి ఆమె నా భార్య అయ్యాక, సమాజంతో ఆమెకు పని ఉండదు. డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరికా ఉండదు’’.
 
హిట్లర్ జీవితంలో మరిచిపోలేని సంఘటన 1906 జూన్‌లో జరిగింది. ఎప్పటిలాగే తల్లితో కలిసి గుర్రపు బండిపై విహారానికి వచ్చిన స్టెఫానీ.. చేతినిండా రోజాలతో కనిపించింది. ఆ రోజు హిట్లర్‌ను దాటుకుంటూ వెళ్తూనే అతడి చేతిలో ఓ రోజా పెట్టి, నవ్వుల జల్లులు కురిపించింది. అంతే.. అతడి ఆనందానికి అవధుల్లేవు. నింగినీ నేలనూ ఏకం చేసేస్తాడా అన్నంతగా ఎగిరి గంతేశాడు. ‘‘చూశావా..! ఈ రోజాని చూశావా. తను నన్ను చూసి నవ్వింది చూశావా. తను కూడా నన్ను ప్రేమిస్తోంది’’ బిగ్గరగా అరుస్తున్నాడు హిట్లర్. కుబిజెక్ మౌనంగా వింటున్నాడు. స్నేహితుడి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు.
 
 దురదృష్టవశాత్తూ ఓ రోజు హిట్లర్ తల్లి రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది. అంత్యక్రియలకు అందరూ వచ్చారు. స్టెఫానీ కూడా వచ్చింది. హిట్లర్‌కు మిగతా వారెవ్వరూ కనిపించలేదు. ఒక్క స్టెఫానీ తప్ప! ‘‘నన్ను ఓదార్చడానికే స్టెఫానీ వచ్చింది కదూ’’ కుబిజెక్‌ను అడుగుతున్నాడు అమాయకంగా. అయితే, స్టెఫానీకి ఇదేమీ తెలీదు. హిట్లర్ తనను పిచ్చిగా ప్రేమిస్తున్నాడనీ, తనకోసం ప్రాణాలైనా ఇస్తాడనీ, తనకోసం జీవితాంతం వేచిచూస్తాడనీ తెలీదు. తెలియాలంటే హిట్లర్ నోరువిప్పాలిగా!
 
ఓరోజు కుబిజెక్‌తో అప్రయత్నంగా, ‘‘స్టెఫానీని కిడ్నాప్ చేస్తాను. తనను గట్టిగా హత్తుకుని డనుబ్ నదిలోకి దూకుతాను. మరణించాకైనా మేం కలిసి జీవిస్తాం’’ అన్నాడు. హిట్లర్ మానసిక పరిస్థితికి, లోలోపలే దాచుకున్న ఉద్వేగానికీ ఈ మాట అద్దం పడుతుంది. అయితే, హిట్లర్ అన్నంత పనీ చేయలేదు. వియన్నా వెళ్లిపోయాడు. తర్వాత చాలాకాలం అతడి జాడే లింజ్ నగరంలో కనిపించలేదు. మరోవైపు స్టెఫానీకి ఓ ఆస్ట్రియా మిలటరీ అధికారితో 1908లో వివాహం జరిగిపోయింది. 1913 క్రిస్‌మస్ సందర్భంగా స్టెఫానీకి శుభాకాంక్షలు చెబుతూ లింజ్‌లోని వార్తాపత్రికల్లో ప్రటకన వేయించాడు హిట్లర్. ఆ సమయానికి ఆమె వియన్నాలో స్థిరపడింది. బహుశా ఆ ప్రకటన ఆమె చూసి ఉండకపోవచ్చు. అలా హిట్లర్ ప్రేమ మూగగానే మిగిలి పోయింది!
 
కొసమెరుపు:
యూదులను హిట్లర్ ద్వేషించినట్టుగా మరే వ్యక్తీ ద్వేషించి ఉండరేమో! అదే హిట్లర్ ఓ యూదు అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడని తెలుసుకున్నాక.. స్టెఫానీ కోసం అన్వేషించింది మీడియా. 1973లో విడుదలైన ఓ ఆస్ట్రో-జర్మన్ టెలివిజన్ ఫిల్మ్‌లో ఆమెను తొలిసారిగా ఇంటర్వ్యూ చేశారు. ‘‘నేను లింజ్‌లో ఉండగా ఓ ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. ఓ అనామక వ్యక్తి తాను డిగ్రీ పూర్తి చేసి వస్తాననీ అంతవరకూ తనకోసం వేచి ఉండమనీ రాశాడు. నేను స్పందించడానికి అతడి చిరునామా లేదు. బహుశా అది హిట్లరే పంపించి ఉంటాడు’’ అని గుర్తుచేసుకుందామె. 
 
ద్వేషాన్నే శ్వాసించి బతికిన వ్యక్తి జీవితంలో ప్రేమా..!? నిజంగా హిట్లర్ ప్రేమలో పడ్డాడా? ఏమో ఎవరికి తెలుసు.. హిట్లర్ కంటే పెద్ద నియంత ప్రేమే..! అది ఆదేశిస్తే పడకుండా ఉండగలడా..!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement