రంగుల కేరింత
సప్తవర్ణ శోభిత రంగుల్లో హోలీ పండుగను ఆదివారం జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. రంగులు, రంగు నీళ్లు చల్లుకుంటూ ఆనంద హేళిలో మునిగితేలారు. హోలీ పూర్ణిమ వసంత రుతు ఆగమనానికి సంకేతం. విజయానికి ప్రతీకగా ఈ హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పట్టణాలు, నగరాల్లో చిన్న పిల్లల నుంచి యువత రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టడం కనిపించింది. ఎదురుపడిన స్నేహితులకు రంగులు చల్లి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఎండ తీవ్రతను సైతం లెక్క చేయక యువత హోలీ సంబరాలలో మునిగితేలింది. ప్రధానంగా చిన్నారులు, యువతీ యువకులు హోలీ వేడుకలతో సరదాగా గడిపారు. కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్లు, నగర వీధుల్లో హోలీ వేడుకలు హోరెత్తాయి. ముఖ్యంగా తిరుపతి నగరంలో మార్వాడీలు, చిన్నా పెద్దా తేడా లేకుండా రంగుల హోలీని ఆడంబరంగా జరుపుకున్నారు. - తిరుపతి కల్చరల్