మావోయిస్టుల కదలికలపై నిఘా: చినరాజప్ప
దేవరపల్లి (పశ్చిమ గోదావరి) : రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో మావోల కదలికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. చోరీలు, దోపిడీల నియంత్రణకు పట్టణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతోపాటు నైట్ బీట్, హై క్లిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంటి నుంచే నెట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు.
పోలీస్ వ్యవస్థలో ఆక్టోపస్‌ను విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇసుక సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయిందని, ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐదు లక్షల హెక్టార్లలో ఎర్రచందనం ఉందని, 90 శాతం అక్రమ రవాణాను నిలువరించగలిగామని చెప్పారు. ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నకిలీ కరెన్సీ చలామణీపై నిఘా పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. సమావేశంలో గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.