బదిలీపై వెళ్లాలని ప్రయత్నించా.. సాధ్యం కాలేదు
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్): బదిలీపై వెళ్లాలని ప్రయత్నించా.. కానీ సాధ్యం కాలేదు అని జిల్లా కలెక్టర్ తన మనోగతాన్ని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఇటీవల జిల్లా అధికారులకు కార్తీక వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు జిల్లా అధికారులు కలెక్టర్‌ను సత్కరించారు. మీరు ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా అధికారులందరికీ మానసిక ఆనందం కలిగేలా వనమహోత్సవాన్ని నిర్వహించినందుకు కృతజ్ఙతలు తెలుపుతున్నామంటూ జిల్లా అధికారులు కలెక్టర్‌ను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో తాను నిక్కచ్చిగా ఉంటానని.. అందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నదే తన తాపత్రయం అని, ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. విధి నిర్వహణలో భాగంగానే తాను ఎవరి మనసునైనా నొప్పించి ఉండవచ్చన్నారు. బదిలీపై వెళ్లాలని ప్రయత్నించినా ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. కార్యక్రమంలో డీఆర్వో గంగాధర్ గౌడ్, సీపీఓ ఆనంద్ నాయక్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్‌వలి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.