ఆశలకు జీవం | Hopes alive | Sakshi
Sakshi News home page

ఆశలకు జీవం

Published Wed, Aug 10 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఆశలకు జీవం

ఆశలకు జీవం

కృష్ణమ్మ పరవళ్లు, శ్రీశైలం కళకళ
ఊరిస్తున్న తుంగభద్ర
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
పాలకులు చిత్తశుద్ధి చూపితేనే ఫలితం
అనంతపురం సెంట్రల్‌ : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొన్నటి వరకూ జలాశయాలు వెలవెలబోవడంతో ఆయకట్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఇటీవల జరిగిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో కేవలం తాగునీటికే కేటాయింపులు చేశారు. నీటిలభ్యతను బట్టి ఆయకట్టు ఇవ్వాలని తీర్మానించారు. అయితే.. వారం, పది రోజుల వ్యవధిలో పరిస్థితి తారుమారైంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. తుంగభద్ర డ్యాంకు  కూడా ఇన్‌ఫ్లో పెరిగింది. 
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తి నిండిపోయాయి. కిందకు భారీగా నీటిని వదులుతున్నారు. డ్యాంలోకి 1.47 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీనివల్ల జలాశయంలో అమాంతం నీటిమట్టం పెరగడంతో హంద్రీ–నీవా కాలువకు మూడు రోజుల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు.  ప్రస్తుతం మూడు పంపుల ద్వారా 1,014 క్యూసెక్కులు పంపింగ్‌ చేస్తున్నారు. ఈ నెల 15లోగా కృష్ణాజలాలు జిల్లాలోని బెళుగుప్ప మండలంలో ఉన్న జీడిపల్లి జలాశయానికి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది శ్రీశైలానికి నీటిలభ్యత ఆశాజనకంగా ఉంటుందని ఇరిగేషన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ నీటిని జిల్లాకు తీసుకురావడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. గతేడాది నీటిని తీసుకురావడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారు. శ్రీశైలంలో నీటిమట్టం పడిపోతున్నా తెలంగాణప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగించడంతో నెల రోజుల ముందే హంద్రీ–నీవాకు నీటిని నిలుపుదల చేశారు. దీనివల్ల ఎనిమిది టీఎంసీలు మాత్రమే జిల్లాకు వచ్చాయి. 2013–14లో మాత్రం దాదాపు 14 టీఎంసీలు వచ్చాయి. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు 40 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో మెజార్టీ శాతం నీటిని దక్కించుకుంటే జిల్లా రైతులు ఇబ్బందుల నుంచి గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. హంద్రీ–నీవా మొదటిదశ  ఆయకట్టుకు ఈ ఏడాది నుంచి సాగునీరు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ, రైతుసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు ఈసారి నీరివ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. 
 
తుంగభద్ర కళకళ
తుంగభద్ర జలాశయానికి వారం రోజులుగా ఇన్‌ఫ్లో పెరడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. పదిరోజుల క్రితం  కేవలం నాలుగు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం 9,673 క్యూసెక్కులకు పెరిగింది. అయితే.. గత ఏడాదితో పోలిస్తే నీటిమట్టం మాత్రం దారుణంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో  64.724 టీఎంసీల నీరు నిల్వ ఉండేది.  ప్రస్తుతం 39.757 టీఎంసీలు మాత్రమే ఉంది. అయితే.. తుంగభద్రకు ఫిబ్రవరి వరకు కూడా ఇన్‌ఫ్లో ఉంటుందని, ఆలస్యంగానైనా ఎక్కువ నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. 
 
16 నుంచి ఆయకట్టుకు నీరు !
హెచ్చెల్సీ కింద ఉన్న గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్‌ (జీబీసీ), హైలెవల్‌ మెయిన్‌ కెనాల్‌æ(హెచ్‌ఎల్‌ఎంసీ)  ఆయకట్టుకు ఈ నెల 16 నుంచి నీటిని విడుదల చేయాలని హెచ్చెల్సీ అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు ఉప కాలువలు నేరుగా ప్రధాన కాలువపై ఆధారపడడంతో ముందుగా వీటికి నీటిని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే హంద్రీనీవా ద్వారా  కృష్ణా జలాలు ఈ నెల 15 నాటికి జిల్లాకు చేరుకుంటాయి. జీడిపల్లి జలాశయం నిండిన తర్వాత పీఏబీఆర్‌లోకి వచ్చి పడతాయి. పీఏబీఆర్‌కు రావడానికి మరో 20 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్రలోకి ఆశాజనకంగా నీరొస్తే మిడ్‌పెన్నార్‌ సౌత్, నార్త్‌ కెనాల్, ఇతర కాలువల కింద ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తున్నారు.