రుయాలో రోగుల సహాయకుల వసతి సముదాయాన్ని ప్రారంభించి, పూజ చేస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్.
– రుయాను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దుతాం
– రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని వెల్లడి
తిరుపతి మెడికల్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగించనున్నట్లు రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర రామ్‌నారాయణ్ ‘రుయా’ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రూ.30లక్షలతో ఏర్పాటు చేసిన రోగుల సహాయకుల సదుపాయముల భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ రాయలసీమకే తలమానికంగా ఉన్న రుయా ఆస్పత్రిని బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.1.50 కోట్లు నిధులు విడుదల చేశామని, అందులో రూ.30లక్షలతో రోగుల సహాయకులమ వసతి సముదాయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. దుస్థితికి చేరిన భవనాలను రూ.30లక్షలతో ఆధునీకరించినట్టు తెలిపారు. క్యాన్సర్ విభాగం భవనాన్ని తొలగించి రూ.25 లక్షలతో నూతన ఆర్థో విభాగాన్ని నిర్మిస్తున్నామని, మరో 15 రోజుల్లో పూర్తవుతుందని వివరించారు. రుయాలో ప్రభుత్వ జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బి.సిద్దానాయక్, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, సీఏఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి, డీఎంహెచ్‌వో డాక్టర్ విజయగౌరి, మెటర్నిటీ సూపరింటెండెంట్ డాక్టర్ భవాని, ఆరోగ్య విభాగపు జిల్లా అద్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డీసీహెచ్‌ఎస్ సరళమ్మ, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ నాగేష్, ఎస్‌ఈ శ్రీనివాసరావు, డీఈ మురళి, ఏపీఎన్జీవోస్ అసోసియేట్ ప్రెసిడెంట్ వరప్రసాద్ పాల్గొన్నారు.