
వసతి గృహాలకు మంగళం
ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం ఎసరు పెడుతోంది. రెసిడెన్షియల్ చదువుల పేరుతో వసతి గృహాలను మూత వేస్తోంది. గత ఏడాది జిల్లాలో 12 ఎస్సీ హాస్టళ్లను మూసేసిన ప్రభుత్వం తాజాగా మంగళవారం మరో 32 హాస్టళ్లకు మంగళం పాడింది.
– జిల్లాలో 32 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు మూత
– ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థి సంఘాల మండిపాటు
ముద్దనూరు:
జిల్లాలో 32 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలను మంగళవారం మూసివేశారు. ఈ హాస్టళ్లలో చదువుతున్న 1490 మంది విద్యార్థులను పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర హాస్టళ్లలో సర్దుబాటు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తమ రెండేళ్ల పాలనలో జిల్లాలో మొత్తం 44 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు ఎసరుపెట్టింది. దీంతో ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామనే పేరుతో నిరుపేద ఎస్సీ విద్యార్థులను ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోందనే విమర్శలు తలెత్తుతున్నాయి.
గత ఏడాది జిల్లాలో 12 ఎస్సీ హాస్టళ్లను మూసివేయగా ఈ ఏడాది మరో 32 హాస్టళ్లను మంగళవారం నుంచి మూసి వేశారు. దశల వారీగా ఎస్సీ సంక్షేమ వసతి గృహాలను మూసివేసి ఎస్సీ విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా, ముద్దనూరు ఎస్సీ వసతి గృహంలోని 27మంది విద్యార్థులను పులివెందుల సమీపంలోని బెస్తవారిపల్లె ఏపీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చేర్పించినట్లు హెచ్‌డబ్లు్యవో గణేష్‌బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 5,6,7,8 తరగతి చదువుతున్న 885మంది విద్యార్థులను రెసిడెన్షియల్ పాఠశాలల్లో, 3,4,9,10 తరగతి చదువుతున్న వారిని ఇతర ఎస్సీ హాస్టళ్లలోకి మార్చినట్లు ఆ శాఖ జిల్లా డిప్యూటీ డైరక్టర్ సరస్వతి తెలిపారు.