మాట్లాడుతున్న కోదండరాం
పేట డివిజన్‌కు నీరందిస్తామనడం విడ్డూరం
Published Thu, Aug 25 2016 11:35 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
– టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
నారాయణపేట : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నారాయణపేట డివిజన్‌కు నీరు అందించడం సాంకేతికపరంగా ఇబ్బందులు తప్పవని, దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘నారాయణపేట–కోడంగల్’ ఎత్తిపోతల ప్రాజెక్టు సాధనకు జలసాధన సమితి ఆధ్వర్యంలో గురువారం పేట సత్యనారాయణచౌరస్తాలో చేపట్టిన రిలేదీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నారాయణపేట డివిజన్‌లోని మక్తల్, నారాయణపేట, కోడంగల్ నియోజకవర్గాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, పరిగి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు వీలుకలుగుతుందన్నారు. పంటలు పండించి ఈ ప్రాంతం నుంచే ఎగుమతి పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నారాయణపేట చేనేత చీరలకు ప్రపంపస్థాయిలో ప్రసిద్ధి ఉందన్నారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కే. దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు సాధించేంతవరకు సకల జనులు కదంతొక్కి రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ముందుండి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ అరుణ, జలసాధన సమితి కన్వీనర్ అనంత్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు బి.రాము, వెంకట్రామరెడ్డి, నింగిరెడ్డి, రెడ్డిగారిరవీందర్‌రెడ్డి, కాశీనాథ్, ప్రశాంత్, గోపాల్, సత్యనారాయణరెడ్డి, నర్సిములుగౌడ్, మనోహర్‌గౌడ్, వెంకోబ, కెంచె శ్రీనివాస్, బాల్‌రాం తదితరులు పాల్గొన్నారు.
Advertisement