విద్యార్థి ఫెయిలైతే సిబ్బందిపై చర్యలు
♦ ఎస్‌ఎస్‌ఏ జిల్లా అధికారి శ్రీనివాస్
♦ బషీరాబాద్ కస్తూర్బా పాఠశాల సందర్శన
బషీరాబాద్: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఫెయిలైతే ఆయా సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని సర్వశిక్షాఅభియాన్ (రాజీవ్ విద్యామిషన్) జిల్లా ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ కస్తూర్బా సిబ్బందిని హెచ్చరించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు. కొంతమంది ప్రగతి బాగో లేదని అసహనం వ్యక్తం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సరైన సమాధానం రాకపోవడంపై సంబంధిత ఉపాధ్యాయురాలిని నిలదీశారు. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం హాస్టల్‌లోని భోజనాన్ని పరిశీలించారు. గుడ్లను సరిగ్గా ఉడికించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించాలని సిబ్బందికి సూచించారు. ఎస్‌ఓ సుమిత్ర, సిబ్బంది ఉన్నారు.