
మతం కన్నా మానవత్వమే మిన్న
► ఎంపీ వరప్రసాద్
► సమస్యలపై ముస్లింలంతా ఏకతాటిపై ఉండాలి : భూమన
తిరుపతి మంగళం: మనుషులను దూరం చేసే మతం కన్నా ఆత్మీయతతో వారిని ఒక్కటిగా చేసే మానవత్వం ఎంతో గొప్పదని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఎంఆర్‌పల్లి పరిధిలోని మసీదులో శనివారం ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. సౌత్‌ఇండియా సయ్యదులు అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జిల్లా హదరీపీఠం పీఠాధిపతి సయ్యద్ షఫీ అహ్మద్‌ఖాదరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా తిరుపతి ఎంపీ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరప్రసాదరావు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఒకరికి మేలు చేయడం తప్ప హాని చేయడం తెలియదన్నారు. అలాంటి వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ముస్లిం సోదరులంతా ఏకతాటిపై ఉంటారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వారి సంక్షేమం కోసం రిజర్వేషన్ లు కల్పించారని.. దాంతో ఎంతో మంది ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం పార్టీలకతీతంగా కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా హిందూ– ముస్లింలు సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. గత 1200 సంవత్సరాల నుంచి హిందూ–ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నామని సౌత్ ఇండియా సయ్యదుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ హిల్లారీఫీర్ సామీరి పేర్కొన్నారు. సమావేశంలో ముస్లిం నాయకులు జుభేదఖాదరీ, జాకీర్‌హుసేన్, రఫీ, డాక్టర్ హమీనుల్లా ఖాదరీ పాల్గొన్నారు.