మూడు మూళ్లు.. ఏడు అడుగుల బంధం.. కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి పరిణయమాడినవాడే కాలయముడయ్యాడు.
జవహర్‌నగర్(రంగారెడ్డి జిల్లా): మూడు మూళ్లు.. ఏడు అడుగులు.. కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణం.. అన్ని మరిచి కట్టుకున్న వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అయిదేళ్ల కూతురు పక్కనే నిద్రపోతూ ఉన్నా.. భార్యను బెల్ట్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన జవహర్‌నగర్‌లోని మార్వాడీలైన్‌లో చోటుచేసుకుంది.
సీఐ నర్సింహారావు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజేష్‌కు, ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గౌతమి(25)తో 2009 మే 9న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.2లక్షల యాభై వేల రూపాయలు కట్న కానుకల కింద ఇచ్చారు. వీరికి ఐదేళ్ల కూతురు వర్షిక ఉంది. బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌లోని అడ్డగుట్టకు వలస వచ్చిన రాజేష్ ప్రింటింగ్‌ప్రెస్‌లో పనిచేస్తుండగా, గౌతమి సికింద్రాబాద్‌లోని యూనినార్ స్టోర్‌లో పనిచేస్తూ ఆరు నెలల కిందట జవహర్‌నగర్‌లోని మార్వాడీలైన్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. రాజేష్కు వేరే అమ్మాయితో సంబంధం ఉందని గౌతమి అతనితో రెండేళ్లుగా గొడవపడుతోంది. రాజేష్ కొంతకాలంగా వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఆమెతో చనువుగా ఉండి పెళ్లి చేసుకోవాలని సిద్ధపడుతున్నాడని గౌతమి తమ తల్లిదండ్రులకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువురి కుటుంబీకులు పలుమార్లు పంచాయితీ చేసి సర్దిచెప్పారు.
అయినా రాజేష్ ప్రవర్తనలో మార్పురాలేదు. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరగుతున్నాయి. మంగళవారం రాత్రి ఇరువుకి కొంతసేవు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాజేష్ గౌతమీని బెల్ట్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. తెల్లవారుజామున గౌతమి ఆత్మహత్య చేసుకుందని బంధువులకు తెలిపిన రాజేష్ జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశాడు.
మహిళ ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న శామీర్‌పేట తహసీల్ధార్ రవీందర్‌రెడ్డి సంఘటనా స్ధలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం జవహర్‌నగర్ సీఐ నర్సింహరావు వివరాలు సేకరించి తమదైన శైలిలో రాజేష్‌ను అడగగా తానే క్షణికావేశంతో గౌతమిని బెల్ట్‌తో గొంతునులిమి చంపేశానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.