హైదరాబాద్ అందరిదీ
⇒ స్థిరపడ్డ వారితో నగరానికి వన్నె
⇒ క్షత్రియ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రాంతాల వారిని అక్కున చేర్చుకుని ఆదరించే సంస్కృతి హైదరాబాద్ సొంతమని, ఆ సంప్రదాయం మరింత గొప్పగా కొనసాగుతుందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడ స్థిరపడ్డ వారందరి సహకారంతో హైదరాబాద్.. దేశంలోనే గొప్ప నగరంగా వెలుగొం దుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి ఆయువు పట్టుగా ఉన్న హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియుల (రాజుల) పాత్ర ఉందని చెప్పారు. భవిష్యత్‌లో ప్రభుత్వం క్షత్రియులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరా బాద్‌లోని కొంపల్లిలో బుధవారం జరిగిన క్షత్రియుల అర్ధ శతాబ్ద ప్రస్థాన సమ్మేళనానికి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.
‘ఉద్యమం ప్రారంభించినప్పుడు జలదృశ్యంలోనే నా వైఖరి స్పష్టంగా చెప్పాను. టీఆర్‌ఎస్ విధానాన్ని వెల్లడించాం. పొట్ట కూటికి వచ్చే వారితో పేచీ లేదు. పొట్టకొట్టే వారితోనే పంచాయితీ అన్నాం. చాలా మంది తమ వైఖరి మార్చుకున్నారు కానీ, మేము మార్చు కోలేదు. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. మేం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్రా ఉంది. దాదాపు 300 ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారు. వివిధ వ్యాపారాలతో స్థిరపడి హైదరాబాద్‌లో భాగమయ్యారు.
పూలగుత్తిలో అన్ని రకాల పూలు ఒదిగినట్లే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్‌కు వన్నె తెచ్చారు. రాజులు పౌరుషానికి ప్రతీక. అల్లూరి సీతారామా రాజు వారసులు. అలాంటి క్షత్రియులు హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చారు. కోళ్ల ఫారాలు, ద్రాక్ష తోటలను హైదరాబాద్‌కు పరిచయం చేసింది వీరే. సినిమా, ఐటీ, నిర్మాణరంగాల్లోనూ రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు క్షత్రియులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని సీఎం ప్రకటించారు. క్షత్రియ ప్రముఖులు రుద్రంరాజు శ్రీహరిరాజు, పెన్మత్స సోమరాజు, టైర్రాజు సత్యనారాయణ, బంగార్రాజు, అప్పల్రాజు, సీతారామరాజు పాల్గొన్నారు.