కడదాకా ఉద్యమిస్తా
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ
- నమ్ముకున్న జాతి కోసం పనిచేస్తా
- ప్రభుత్వం నన్ను ప్రపంచ ఉగ్రవాదిలా చిత్రీకరించింది
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధింపులకు గురిచేసినా ఉద్యమం నుంచి వెనకడుగు వేయబోనని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకూ ఉద్యమిస్తానని చెప్పారు. తనపై, తన కుటుంబంపై ప్రభుత్వం కక్షకట్టి వేధింపులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో ఆమరణ దీక్ష విరమించిన అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
‘‘తుని ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన తరువాత అరెస్టులు చేస్తామన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని మరచి అరెస్టులు మొదలు పెట్టారు. ఈ నెల 7న అమలాపురం వెళ్లి నన్ను అరెస్టు చేయమని కోరాను. కేసులు లేవన్నారు. 9వ తేదీ వచ్చేసరికి 69 కేసులు పెట్టారని, నాపై సెల్‌ఫోన్ దొంగతనం కేసు కూడా పెట్టారని తెలిసింది. 9వ తేదీన ఉదయం అరెస్టు చేయడానికి వచ్చామని ఎస్పీ, ఓఎస్‌డీ చెప్పారు. సమయం ఇవ్వాలని అడిగినా వినలేదు. మీడియాను బయటకు పంపించి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. ఇది కక్ష సాధింపు కాక మరేమిటి? నన్నయితే గౌరవంగానే తీసుకెళ్లారు. నా భార్యను బండబూతులు తిట్టుకుంటూ ఎత్తి బస్సులో కుదేశారు. నా భార్య పేషెంట్. నా కోడలిని కూడా అదే పదజాలంతో తిట్టి లాక్కెళ్లారు. నా కొడుకును కొట్టుకుంటూ తీసుకెళ్లారు. నా బావమరిదిని, ఆయన భార్యను కూడా వదలలేదు. ఇదేం పాలన?
నా శరీరంలో సెలైన్ బాటిళ్లున్నాయి
మాపట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకోవాలని కోరను, వారి కర్మ వారే అనుభవిస్తారు. భగవంతుడు చూస్తాడు. నా కుటుంబానికి జరిగిన అవమానం బహుశా ఏ రాజకీయ నాయకుడికీ జరగకపోవచ్చు. మమ్మల్ని అవమానించిన వారికి భగవంతుడు తగిన శాస్తి చేస్తాడని ఎదురు చూస్తున్నాను. బాధ్యులకు భగవంతుడు వేసే శిక్ష పడే వరకూ మా ఇంట్లో సంక్రాంతి, ఉగాది, వినాయకచవితి, నవమి, దశమి... ఇలా ఏ పండుగా చేసుకోం. ఇప్పుడు నా శరీరంలో రక్తం లేదు. సెలైన్ బాటిళ్లున్నాయి.
ఆస్పత్రిలో పత్రిక కూడా ఇవ్వలేదు
పోరాడే శక్తిని కోల్పోయినా ఉద్యమం నుం చి వెనక్కిపోను. నన్ను నమ్ముకున్న జాతి, ఇతర కులాల కోసం పనిచేస్తాను. జేఏసీని ముందు పెట్టి వారి వెనకాల నేను నడ వాల ని, ఉద్యమాన్ని వదలకూడదని నిర్ణరుుంచుకున్నాను. కాపులను బీసీల్లో చేరుస్తామం టూ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రాణమున్నంత వరకూ పోరాడుతా. అలా అడిగినందుకే ప్రపంచ ఉగ్రవాది మాదిరిగా చిత్రీకరించి మీడియాకు, ప్రజలకు తెలియకుండా 14 రోజులు ఆస్పత్రిలో బంధించారు. సెంట్రల్ జైలులో ఉన్నవారికి వార్తా పత్రిక ఇస్తారు. నాకు అది కూడా ఇవ్వకుండా అవమానించారు. నాకు సంఘీభావం ప్రకటించిన వారందరికీ ే పాదాభివందనం చేసుకుంటున్నాను.
అన్నం పెట్టిన చేతులనే నరికేశారు
మా ఇంట్లో ఎంతో మంది అధికారులకు భోజనం పెట్టాను. పోలీసు స్టేషన్‌లో ఫంక్షన్ అయితే వారికి కావల్సినవి సమకూర్చాం. ఊరిలో ఫంక్షన్లకు అన్ని ఆఫీసులతోపాటు పోలీసు స్టేషన్లలో సిబ్బందిని కూడా పిలిచాం. అలా అన్నం పెట్టిన నా చేతులను నరికేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఇలానే ఉందని సరిపెట్టుకుంటాను’’ అని ముద్రగడ పద్మనాభం చెప్పారు.
అండగా వైఎస్సార్‌సీపీ
కాపుల ఉద్యమం, ముద్రగడ దీక్షకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ తొలినుంచీ అండగా నిలిచారు. ప్రభుత్వ దమనకాండపై నిప్పులు చెరిగారు. కాపుల పోరాటాన్ని విచ్ఛిన్నానికి సర్కారు కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో సైతం కాపు ఉద్యమానికి మద్దతుగా తీర్మానాన్ని ఆమోదించారు.
ముద్రగడ ఆమరణ దీక్ష విరమణ
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 14 రోజుల తర్వాత బుధవారం ఆమరణ దీక్ష విరమించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి నుంచి బుధవారం కిర్లంపూడిలోని స్వగృహానికి చేరుకున్న ముద్రగడకు, ఆయన భార్య పద్మావతికి కాపు ఉద్యమ నాయకులు, జేఏసీ నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాపు నేతలు, అభిమానులు తరలిరావడంతో ముద్రగడ నివాసం కోలాహలంగా మారింది. రాజమహేంద్రవరం నుంచి కిర్లంపూడి వరకు దారిపొడవునా కాపు సామాజికవర్గం ముద్రగడకు ఘనంగా స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, కాపు ఉద్యమాన్ని ప్రసారం చేయని టీవీ చానళ్లు, పత్రికలకు వ్యతిరేకంగా కాపు యువకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నిష్పక్షపాతంగా ప్రసారాలు చేసిన సాక్షి టీవీ, వార్తలు ప్రచురించిన ‘సాక్షి’ జిందాబాద్ అంటూ నినదించారు. తునిలో కాపు ఐక్యగర్జనలో చోటుచేసుకున్న ఘటనల్లో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ కిర్లంపూడిలో ఈ నెల 9నుంచి కుటుంబ సమేతంగా ఆమరణ దీక్ష చేపట్టారు. అదే రోజు సాయంత్రం పోలీసులు ఆయనను బలవంతంగా రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు.ఆరు పదుల వయస్సులో ఆరోగ్య సమస్యలున్నా లెక్క చేయకుండా ముద్రగడ 14 రోజులపాటు దీక్ష కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. తుని ఘటనల్లో అరెస్టు చేసిన 13 మందిని బెయిల్‌పై విడుదల చేసింది. దీంతో దీక్ష విరమించారు.