
ఆదరాభిమానాల్లో ‘లక్ష్మీపుత్రుడు’
దివ్యాంగుడికి శుభాకాంక్షలు తెలిపిన ఐటీడీఏ పీఓ డా.లక్ష్మీ షా
పార్వతీపురం: ఆయన ఓ ఐఏఎస్ అధికారి. ఆయన చుట్టూ ఎప్పుడూ అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు తిరుగుతుంటారు. ప్రత్యేక సందర్భాలు, పండగలు వచ్చాయంటే క్షణం తీరిక లేకుండా ఆయనకు అందరూ శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీ పడతారు. ‘ఇతరులలోని లోపాలను వెతికే వారు ఎవ్వరినీ ప్రేమించలేరు’. అన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి దివ్యాంగుడైన ఓ వ్యక్తిపై ప్రేమాభిమానాలు చూపించి దగ్గరికి వెళ్లి పూలు, పళ్లు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా పార్వతీపురం ఐటీడీఏ పీఓ డాక్టర్ లక్ష్మీషాకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అందరూ పళ్లు, పుష్పగుచ్ఛాలు, డైరీలతో వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అందరితో పాటు వచ్చిన (ఉపాధి కార్యాలయ ఉద్యోగి) దివ్యాంగుడైన భాస్కరరావు అధికారికి శుభాకాంక్షలు చెప్పే అవకాశం తనకు వస్తుందో రాదోనని బితుకుబితుకుమంటూ దూరంగా నిల్చున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన పీఓ లక్ష్మీషా తానే స్వయంగా పుష్పగుచ్ఛం, పళ్లు పట్టుకుని దివ్యాంగుడైన భాస్కరరావు దగ్గరకు వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయంలో అందరూ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం పీఓ లక్ష్మీషా స్థానిక ‘జట్టు’ ఆశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలకు పళ్లు, పువ్వులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పిల్లలతో పీఓ మాట్లాడుతూ ఏ అవసరమొచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.