కాలువల్లో చెత్త వేస్తే సీజ్
విజయవాడ సెంట్రల్ : కాలువల్లో చెత్త, వ్యర్థాలను వేసే వ్యాపారుల నుంచి జరిమానా వసూలు చేయడంతోపాటు షాపుల్ని సీజ్ చేస్తామని కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ కూరగాయల, పూల మార్కెట్ వ్యాపారులతో గురువారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ షాపుల నుంచి వచ్చే చెత్త, వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో మాత్రమే పడేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాల్సిందిగా కోరారు. కాల్వగట్ల సుందరీకరణలో భాగంగా గ్రీనరీని అభివృద్ధి పర్చేందుకు సహకరించాల్సిందిగా కోరారు. ఫుట్‌బ్రిడ్జి నుంచి కొందరు వ్యాపారులు చెత్తను కాల్వల్లోకి పడేస్తున్నారన్నారు. ఈవిధానాన్ని విడనాడాలన్నారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ.షుకూర్, ఈఈ ఉదయ్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టీడీపీ పశ్చిమ నియోజక వర్గ కన్వీనర్ నాగుల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.