ఇలాగైతే కష్టం
Published Wed, Mar 15 2017 1:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : ‘ఇలా అయితే కష్టమే. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సరికాదు. అందరూ కలిసి పనిచేయండి. జిల్లాకు ఏం కావాలో ప్రతిపాదనలు ఇవ్వండి. మీ జిల్లాలో పార్టీని బలోపేతం చేయండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. మంగళవారం రాత్రి అమరావతిలోని తన కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పత్రికల్లో ప్రచురితమైన వ్యతిరేక కథనాలను చదివి విని పించారు. వాటిపై సంబంధిత ప్రజాప్రతినిధులను వివరణ కోరారు. ఇందులో ఎక్కువ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలే ఉన్నాయి. కామవరపుకోట మండ లంలో ఉద్యాన శాఖలో అవినీతిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై చర్చ నడిచింది. మంత్రి పీతల సుజాత స్పందిస్తూ ఈ అంశంపై కలెక్టర్ విచారణ జరుపుతున్నారని, త్వరలో బాధ్యులపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కుంభకోణంలో అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండగా, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాత్రం వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఎంపీ మాగంటి బాబు–పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, మాగంటి బాబు–మంత్రి పీతల సుజాత మధ్య గల విభేదాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కామవరపుకోటలో సినిమా థియేటర్ విషయంలో మంత్రి పీతల సుజాత, విప్ చింతమనేని ప్రభాకర్ మధ్య వివాదంపైనా ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ‘అది మంత్రి నియోజకవర్గం. అక్కడ నీకేం పని’ అంటూ చింతమనేనిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ‘పార్టీ కోసం కష్టపడుతున్నావు... ఇలా మిగిలిన వారితో విభేదాలు పెట్టుకుంటే బలహీనం అవుతావు కదా. నువ్వు కూడా మారాలి’ అంటూ మంత్రి సుజాతకు సూచన చేశారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌కు కూడా ఎమ్మెల్యేలు, కిందిస్థాయి కార్యకర్తలను కలుపుకుపోవాలంటూ హితవు పలికినట్టు సమాచారం. తాడేపల్లిగూడెంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో నెలకొన్న వివాదంపైనా చర్చ సాగింది. బీజేపీ మిత్రపక్షం కావడంతో సాధ్యమైనంత వరకూ సర్దుకుపోవాలని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడిని ఈ వివా దాన్ని పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకగ్రీవం చేసినందుకు మంత్రి, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి అభినందించారు. తాడేపల్లిగూడెంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా నేతలు సీఎంను కోరారు.
Advertisement
Advertisement