కలంపై ఖాకీ జులుం | Illegal case on Sakshi Reporter | Sakshi
Sakshi News home page

కలంపై ఖాకీ జులుం

Published Sun, Nov 8 2015 3:28 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM

కలంపై ఖాకీ జులుం - Sakshi

కలంపై ఖాకీ జులుం

సాక్షి విలేకరిపై అక్రమ కేసు బనాయించిన మెదక్ ఎస్పీ సుమతి
♦ ఎనిమిది నెలల కిందట రాసిన వార్తపై ఇప్పుడు కేసు
♦ సీఎం సొంత జిల్లాలోనే కలంపై ఆంక్షలా?
♦ మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు
♦ కేసు ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక
 
 సంగారెడ్డి: ప్రజల పక్షాన అక్షర యజ్ఞం చేసే కలంపై ఖాకీ కక్ష గట్టింది! అక్రమాలను ఎండగట్టిన నేరానికి సంకెళ్లు వేసింది. మెదక్ జిల్లా పోలీసు వ్యవస్థలో వైఫల్యాలపై వరుస కథనాలు రావడాన్ని జీర్ణించుకోలేని జిల్లా ఎస్పీ సుమతి జర్నలిస్టులపై యుద్ధం ప్రకటిం చారు. 8 నెలల క్రితం రాసిన ఓ వార్తను సాకుగా చూ పి సిద్దిపేట రూరల్ విభాగానికి సాక్షి విలేకరిగా పనిచేస్తున్న ప్రభాకర్‌పై అక్రమ కేసు బనాయించి శనివారం అరెస్టు చేశారు. తమకు వ్యతిరేకంగా వార్తలు వస్తే చా లు.. దాదాపు అన్ని పత్రికలు, మీడియా ఛానళ్ల ప్రతి నిధులపై సుమతి తన ప్రతాపం చూపిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే జర్నలిస్టులపై, రాసే వార్తలపై ఆంక్షలు విధించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది.

 ఇదీ కట్టుకథ..
 ఎనిమిది నెలల కిందట సిద్దిపేటలోని తహశీల్దార్, ఎండీవో కార్యాలయాల వద్ద నక్సలైట్ల పేరుతో పోస్టర్లు వెలిశాయి. దీనిపై సాక్షి విలేకరి ప్రభాకర్ వార్త రాశారు. పోలీసులు మాత్రం నలుగురు వ్యక్తులతో కలిసి ప్రభాకర్ పోస్టర్లు అతికించారని ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు కట్టుకథ అల్లారు. అంతేగాకుండా దొంగనోట్ల కేసును బనాయించే ప్రయత్నాలు చేశారు. ముందుగా దొంగనోట్లతో ప్రభాకర్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఎస్పీ సుమతి.. ఆ తర్వాత పోలీసులతో విలేకరుల సమావేశం పెట్టించి ఆ కేసును కూడా అంటగట్టే ప్రయత్నం చేశారు. ప్రభాకర్‌ను ‘సాక్షి’ జిల్లా బ్యూరో ఇన్‌చార్జి వర్దెల్లి వెంకటేశ్వర్లు నేరుగా జిల్లా ఎస్పీ సుమతి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌కు వద్దకు తీసుకువెళ్లినా.. ప్రభాకర్‌ను అరెస్ట్ చేశామని ఒకసారి, పరారీలో ఉన్నాడని మరోసారి పోలీసులు ప్రకటించడం గమనార్హం.

 ఇది దుర్మార్గం: ఎమ్మెల్యే సోలిపేట
 సాక్షి రిపోర్టర్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయటాన్ని రాష్ట్ర అంచనాల పద్దు కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఖండించారు. జర్నలిస్టులు చేస్తున్న ఈ పోరులో తానే ముందుండి నడుస్తానన్నారు. ‘జర్నలిస్టులపై కేసులు పెట్టేందుకు ముందు దాడుల వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరపాలన్న నిబంధన ఉంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ, జర్నలిస్టులు సభ్యులుగా ఉంటారు. ఇవేమీ పాటించకుండా కేసులు బనాయించటం దుర్మార్గమైన చర్య. తెలంగాణ ప్రభుత్వం పాలసీ ఇది కానే కాదు’ అని అన్నారు. అక్రమ కేసును సీఎం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు.

 పోలీసుల తీరు అప్రజాస్వామికం: విరాహత్
 సాక్షి విలేకరి ప్రభాకర్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఆపాదించి అరెస్ట్ చేయడం అన్యాయమని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ అన్నారు. ‘పోలీసుల తీరు అప్రజాస్వామికం. ఇది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు. కేసును ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తాం’ అని ఆయన హెచ్చరించారు.

 సిగ్గుచేటు: క్రాంతికిరణ్
 వార్త రాసినంత మాత్రన కేసు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని టీయూడ బ్ల్యూజే రాష్ర్ట ప్రధాన కార్యద ర్శి క్రాంతికిరణ్ అన్నారు. సీఎం సొంత జిల్లాలో జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఏవైనా ఆరోపణలు వస్తే రాష్ర్ట అటాక్స్ క మిటీ దృష్టికి తెచ్చి ఉంటే బాగుండేదన్నారు. అలా కాకుండా జిల్లా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమన్నారు.
 
 కేసు ఎత్తివేయకపోతే ప్రత్యక్ష పోరాటం: అల్లం
 ఎనిమిది నెలల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి సాక్షి విలేకరి ప్రభాకర్‌పై అక్రమ కేసు బనాయించి ఇప్పుడు అరెస్టు చేయటాన్ని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తీవ్రంగా ఖండించారు. మెదక్  జిల్లా ఎస్పీ సుమతి అతిగా ప్రవర్తిస్తున్నారన్నారు. విలేకరిపై కేసును వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. విలేకరిపై కేసు విషయాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళతామన్నారు. విలేకరులను భయాందోళనకు గురి చేస్తూ పత్రిక స్వేచ్ఛకు భంగం కల్గించడం మానుకోవాలని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement