SP sumati
-
ఇబ్రహీంపూర్ ఘటనలో ఇరువర్గాలపై కేసులు
-
ఇబ్రహీంపూర్ ఘటనలో ఇరువర్గాలపై కేసులు
♦ శ్రీహరిది హత్య కేసుగా నమోదు ♦ హత్య కేసులో ఆరుగురు.. దాడి ఘటనలో 33 మందిపై కేసు ♦ వీడియోల ఆధారంగానే నిందితుల గుర్తింపు: ఎస్పీ సిద్దిపేట రూరల్/ముస్తాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ ఘటనలో పోలీసులు ముందుకు కదులుతున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్లకి చెందిన టేకేదారు శ్రీరాం శ్రీహరిని కొట్టి చంపడం.. బాధిత కుటుంబీకులు, బంధువులు ఇబ్రహీంపూర్‌లోని సర్పంచ్ ఇంటిపై దాడికి పాల్పడి రణరంగాన్ని సృష్టించడంపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన వివరాలను శనివారం సిద్దిపేట రూరల్ పీఎస్‌లో ఎస్పీ సుమతి మీడియాకు వెల్లడించారు. శ్రీహరి హత్య కేసులో ఆరుగురిపై కేసు.. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్లకి చెందిన టేకేదారు శ్రీరాం శ్రీహరి (33)పై గురువారం సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో దాడి చేసి, ఆయన మృతికి కారణమైన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఇందులో సర్పంచ్ కుమారులు కుంబాల ఎల్లారెడ్డి, నాగిరెడ్డిలతోపాటు అదే గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, రజనీకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలపై కేసు నమోదైనట్టు చెప్పారు. ఇందులో రజనీకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పరారీలు ఉన్నారన్నారు. సర్పంచ్ ఇంటిపై దాడి ఘటనలో 33 మందిపై కేసు.. ఇబ్రహీంపూర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనలో వీడియోల ఆధారంగా మొత్తం 33 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. శ్రీహరి మృతి చెందడంతో కోపోద్రిక్తులైన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్లతోపాటు పలు గ్రామాల నుంచి పెద్దఎత్తున ఇబ్రహీంపూర్‌కు శవంతో తరలివచ్చారని, మృతదేహంతో గ్రామంలోని సర్పంచ్ ఇంటిఎదుట ఆందోళనకు దిగడంతోపాటు సర్పంచ్‌ను సజీవ దహనం చేయడానికి యత్నించారన్నారు. ఇందులో భాగంగానే సర్పంచ్ ఇంటిపై కిరోసిన్‌పోసి నిప్పంటించి దహనం చేయడంతో భారీగా ఆస్తినష్టం జరిగిందన్నారు. సర్పంచ్ కుంబాల లక్ష్మితోపాటు విలేకరి నాగరాజు, పోలీసులకూ గాయాలయ్యాయని, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై అక్కడ పోలీసులు తీసిన వీడియో క్లిప్పింగ్ ఆధారంగా మహిళలతో కలిపి మొత్తం 33 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది సర్పంచ్ ఈసరి కృష్ణను చేర్చారు. అలాగే, కొలాపురం కనకరాజు, ఉడత తిరుపతి, గడ్డమీది రాకేశ్, పల్లె తిరుపతిలను అరెస్ట్ చేశామన్నారు. మిగతా 27మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
2 గంటలు... 3 ఏటీఎంలు
► విరుచుకుపడ్డ దోపిడీ దొంగలు సంగారెడ్డిలో రూ.3.21 లక్షలు.. ► మెదక్‌లో ఏటీఎం ధ్వంసం అగ్నికి ఆహుతైన రూ. 3 లక్షలు ► బొలెరో వాహనంలో పరారైన ముఠా మెదక్‌లో పాత వాహనంతో పోలీస్ చేజ్ ► తప్పించుకున్న దొంగల ముఠా సంగారెడ్డి క్రైం/మెదక్/కౌడిపల్లి: అర్ధరాత్రి వేళ.. అంతా నిద్రిస్తున్న సమయాన... దోపిడీ దొంగలు పంజా విసిరారు. రెండు గంటల వ్యవధిలోనే మూడు ప్రాంతాల్లోని ఏటీఎంలను ధ్వంసం చేశారు. ఒకచోట నగదుతో ఉడాయించగా మిగతా రెండు చోట్ల విఫలయత్నం చేశారు. మెదక్‌లో పోలీసులు చేజ్ చేసినా చిక్కకుండా తప్పించుకున్నారు. ఈ ఘటనలకు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ ముఠానే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఒకే ముఠా మూడు చోట్ల అదీ ప్రధాన రహదారులపై విరుచుకు పడి పోలీసులకు సవాల్ విసిరింది. మొదట సంగారెడ్డి బస్టాండ్‌లో... జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పాతబస్టాండ్‌లోగల ఇండి క్యాష్ ఏటీఎంలో దోపిడీ దొంగల ముఠా చొరబడింది. నలుగురు సభ్యులున్న ఈ ముఠా బొలెరో వాహనంలో వచ్చారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటల ప్రాంతంలో ముఖాలకు ముసుగులు ధరించి, చేతులకు గ్లౌస్లు ధరించిన దుండగులు ఇండిక్యాష్ ఏటీఎంలోకి ప్రవేశించారు. మొదట సీసీ కెమెరాలను, వైర్లను ధ్వంసం చేశారు. ఏటీఎం మిషన్‌ను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి అందులోని రూ.3.21 లక్షల నగదుతో ఉడాయించారు. రెండోది కౌడిపల్లి... సంగారెడ్డిలో విజయవంతంగా పని పూర్తిచేసుకున్న దుండగులు నేరుగా నర్సాపూర్ మీదుగా కౌడిపల్లికి చేరుకున్నారు. కౌడిపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను దోచుకోవడానికి యత్నించారు. చివరగా మెదక్‌లో.. కౌడిపల్లి నుంచి మెదక్ పట్టణానికి చేరుకున్న ఈ ముఠా సభ్యులు ఆటోనగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేయడానికి యత్నించారు. ఏటీఎం నుంచి మంటలు రావడం అదే సమయంలో గస్తీ పోలీసులు గమనించడంతో బొలెరో వాహనంలో పరారయ్యారు. దొంగల అలికిడిన గమనించిన పోలీసులు వారిని వెంబడించారు. మెదక్ నుంచి నిజామాబాద్ జిల్లా పరిధిలోని నాగిరెడ్డిపేట వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర దొంగలను పట్టుకోవడానికి చేజ్ చేశారు. ఈ క్రమంలో దొంగలపై నిజామాబాద్ జిల్లాలో అక్కడి పోలీసులు కాల్పులు సైతం జరిపారు. గ్యాస్ కట్టర్లతో మెదక్‌లోని ఏటీఎంను ధ్వంసం చేయడంతో మంటలు వ్యాపించి రూ.3 లక్షలు కాలి బూడిదయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత రెండు రోజులుగా నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఏటీఎంలే లక్ష్యంగా ముఠా పంజా విసురుతుంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా బ్యాంకర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మూడు ఘటనల్లోనూ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. సందర్శించిన ఎస్పీ సుమతి మెదక్: దుండగుల చేతిలో ధ్వం సమైన మెదక్ పట్టణంతోపాటు కౌడిపల్లిలోని ఏటీఎం కేంద్రాలను ఎస్పీ సుమతి సందర్శించారు. దోపిడీకి యత్నించిన తీరును ఆమె పరిశీలించారు. ఏటీఎంకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దొంగలను పట్టుకొని తీరుతామన్నారు. గత అక్టోబర్ లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాల్లో ఇలాంటి చోరీలు జరిగాయన్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. దొంగలను వెంబడించిన పోలీసులకు రివార్డు.. మెదక్‌లోని ఏటీఎంలో చోరీ విషయాన్ని గమనించి దొంగలను వెంబడించిన గస్తీ బృందంలోని హెడ్‌కానిస్టేబుల్ ఎక్బాల్, జీపు డ్రైవర్, కానిస్టేబుల్ వీరప్ప, హోంగార్డు విష్ణులకు ఎస్పీ సుమతి నగదు రివార్డు ప్రకటించి అభినందించారు. ఆమెవెంట డీఎస్పీ రాజారత్నం, రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐలు హన్మంత్, ఎల్లాగౌడ్, సంతోష్‌కుమార్ ఉన్నారు. సీసీ కెమెరాను పైకి లేపి... కౌడిపల్లి: నర్సాపూర్-మెదక్ ప్రధాన రహదారిపై మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. కేంద్రంలోకి చొరబడి సీసీ కెమెరాలను పైకి తిప్పారు. ఏటీఎం ముందు డోర్ లాక్తీశారు. అందులో డబ్బులు లేకపోవడంతో కింద ఉన్న బాక్స్‌ను పగులగొట్టి తెరిచారు. లోపలి భాగంలో గల క్యాష్ లాకర్ తెరుచుకోకపోవడంతో చేసేదిలేక వెనుదిరిగారు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి బ్యాంకు అటెండర్ పోచాగౌడ్‌కు తెలిపారు. ఆ వెంటనే అతను విషయాన్ని మేనేజర్ మధుతోపాటు పోలీసులకు సమాచారం అందించాడు. నర్సాపూర్ సీఐ తిరుపతి రాజు, స్థానిక ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డబ్బు భద్రం.. ఏటీఎంలో డబ్బు భద్రంగా ఉందని బ్యాంక్ మేనేజర్ మధు తెలిపారు. ఏటీఎం ముందు భాగం మాత్రమే తెరిచారని, వెనుక క్యాష్‌బాక్స్ తెరుచుకోవపోవడంతో కింద ఉన్న బాక్స్‌ను తెరిచారన్నారు. క్యాష్‌బాక్స్ తెరుచుకోక పోవడంతో ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఇందులో సుమారు రూ 8 లక్షలు ఉన్నట్టు చెప్పారు. ఓపెన్ కానీ సీసీ కెమెరా ఫుటేజీ.. కౌడిపల్లిలోని ఏటీఎంలో చోరీకి యత్నించిన విషయాన్ని సీసీ కెమెరా ఆధారంగా దొంగలను గుర్తించే అవకాశాన్ని మేనేజర్ పరిశీలించారు. కాగా సీసీ కెమెరా ఫుటేజీలు కంప్యూటర్లో ఓపెన్ కాలేదు. -
కలంపై ఖాకీ జులుం
సాక్షి విలేకరిపై అక్రమ కేసు బనాయించిన మెదక్ ఎస్పీ సుమతి ♦ ఎనిమిది నెలల కిందట రాసిన వార్తపై ఇప్పుడు కేసు ♦ సీఎం సొంత జిల్లాలోనే కలంపై ఆంక్షలా? ♦ మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు ♦ కేసు ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక సంగారెడ్డి: ప్రజల పక్షాన అక్షర యజ్ఞం చేసే కలంపై ఖాకీ కక్ష గట్టింది! అక్రమాలను ఎండగట్టిన నేరానికి సంకెళ్లు వేసింది. మెదక్ జిల్లా పోలీసు వ్యవస్థలో వైఫల్యాలపై వరుస కథనాలు రావడాన్ని జీర్ణించుకోలేని జిల్లా ఎస్పీ సుమతి జర్నలిస్టులపై యుద్ధం ప్రకటిం చారు. 8 నెలల క్రితం రాసిన ఓ వార్తను సాకుగా చూ పి సిద్దిపేట రూరల్ విభాగానికి సాక్షి విలేకరిగా పనిచేస్తున్న ప్రభాకర్‌పై అక్రమ కేసు బనాయించి శనివారం అరెస్టు చేశారు. తమకు వ్యతిరేకంగా వార్తలు వస్తే చా లు.. దాదాపు అన్ని పత్రికలు, మీడియా ఛానళ్ల ప్రతి నిధులపై సుమతి తన ప్రతాపం చూపిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే జర్నలిస్టులపై, రాసే వార్తలపై ఆంక్షలు విధించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఇదీ కట్టుకథ.. ఎనిమిది నెలల కిందట సిద్దిపేటలోని తహశీల్దార్, ఎండీవో కార్యాలయాల వద్ద నక్సలైట్ల పేరుతో పోస్టర్లు వెలిశాయి. దీనిపై సాక్షి విలేకరి ప్రభాకర్ వార్త రాశారు. పోలీసులు మాత్రం నలుగురు వ్యక్తులతో కలిసి ప్రభాకర్ పోస్టర్లు అతికించారని ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు కట్టుకథ అల్లారు. అంతేగాకుండా దొంగనోట్ల కేసును బనాయించే ప్రయత్నాలు చేశారు. ముందుగా దొంగనోట్లతో ప్రభాకర్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఎస్పీ సుమతి.. ఆ తర్వాత పోలీసులతో విలేకరుల సమావేశం పెట్టించి ఆ కేసును కూడా అంటగట్టే ప్రయత్నం చేశారు. ప్రభాకర్‌ను ‘సాక్షి’ జిల్లా బ్యూరో ఇన్చార్జి వర్దెల్లి వెంకటేశ్వర్లు నేరుగా జిల్లా ఎస్పీ సుమతి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌కు వద్దకు తీసుకువెళ్లినా.. ప్రభాకర్‌ను అరెస్ట్ చేశామని ఒకసారి, పరారీలో ఉన్నాడని మరోసారి పోలీసులు ప్రకటించడం గమనార్హం. ఇది దుర్మార్గం: ఎమ్మెల్యే సోలిపేట సాక్షి రిపోర్టర్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయటాన్ని రాష్ట్ర అంచనాల పద్దు కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఖండించారు. జర్నలిస్టులు చేస్తున్న ఈ పోరులో తానే ముందుండి నడుస్తానన్నారు. ‘జర్నలిస్టులపై కేసులు పెట్టేందుకు ముందు దాడుల వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరపాలన్న నిబంధన ఉంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ, జర్నలిస్టులు సభ్యులుగా ఉంటారు. ఇవేమీ పాటించకుండా కేసులు బనాయించటం దుర్మార్గమైన చర్య. తెలంగాణ ప్రభుత్వం పాలసీ ఇది కానే కాదు’ అని అన్నారు. అక్రమ కేసును సీఎం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. పోలీసుల తీరు అప్రజాస్వామికం: విరాహత్ సాక్షి విలేకరి ప్రభాకర్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఆపాదించి అరెస్ట్ చేయడం అన్యాయమని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ అన్నారు. ‘పోలీసుల తీరు అప్రజాస్వామికం. ఇది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు. కేసును ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తాం’ అని ఆయన హెచ్చరించారు. సిగ్గుచేటు: క్రాంతికిరణ్ వార్త రాసినంత మాత్రన కేసు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని టీయూడ బ్ల్యూజే రాష్ర్ట ప్రధాన కార్యద ర్శి క్రాంతికిరణ్ అన్నారు. సీఎం సొంత జిల్లాలో జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఏవైనా ఆరోపణలు వస్తే రాష్ర్ట అటాక్స్ క మిటీ దృష్టికి తెచ్చి ఉంటే బాగుండేదన్నారు. అలా కాకుండా జిల్లా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమన్నారు. కేసు ఎత్తివేయకపోతే ప్రత్యక్ష పోరాటం: అల్లం ఎనిమిది నెలల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి సాక్షి విలేకరి ప్రభాకర్‌పై అక్రమ కేసు బనాయించి ఇప్పుడు అరెస్టు చేయటాన్ని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తీవ్రంగా ఖండించారు. మెదక్ జిల్లా ఎస్పీ సుమతి అతిగా ప్రవర్తిస్తున్నారన్నారు. విలేకరిపై కేసును వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. విలేకరిపై కేసు విషయాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళతామన్నారు. విలేకరులను భయాందోళనకు గురి చేస్తూ పత్రిక స్వేచ్ఛకు భంగం కల్గించడం మానుకోవాలని ఆయన అన్నారు. -
కట్నం వేధింపులపై చర్యకు వినతి
- ‘గ్రీవెన్స్’లో ఎస్పీకి మహిళ ఫిర్యాదు సంగారెడ్డి క్రైం: అదనపు కట్నం కోసం వేధిస్తున్న తన భర్త, అత్తమామలు, బంధువులపై చర్యలు తీసుకోవాలని మిరుదొడ్డి మడలం అల్వాల్ గ్రామానికి చెందిన తూము అనిత ఎస్పీ సుమతికి విన్నవించారు. గ్రీవెన్స్ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సుమతి ఫిర్యాదుదారుల నుంచి వినతులు తీసుకున్నారు. న్యాయం చేస్తానని ఎస్పీ ఆమెకు హామీనిచ్చారు. కాగా, తమ సంతకాలను ఫోర్జరీ చేసిన వారిపై మెదక్ పట్టణం ఫతేనగర్‌కు చెందిన కళావతి, స్వరూప ఫిర్యాదు చేశారు. తన భూమిని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారంటూ గొల్ల సురేష్ (జహీరాబాద్), దారిని కొందరు తమ సొంత భూమిలో కలుపుకొన్నారంటూ మజీద్‌పల్లి గ్రామస్తులు ఎస్పీ దృష్టికి తెచ్చారు. -
ఫాంహౌస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్
జగదేవ్‌పూర్(మెదక్): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. మంగవారం రాత్రి ఫాంహౌస్‌కు వస్తారని పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, చివరి క్షణంలో బుధవారానికి వాయిదా పడింది. దీంతో పోలీసులు వెనుదిరిగారు. బుధవారం మధ్యాహ్నం వస్తున్నారని సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ సుమతి అధ్వర్యంలో రోడ్డు గుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు తన కాన్వాయ్ ద్వారా ముఖ్యమంత్రి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గడా అధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. రాత్రి ఇక్కడే ఉండి గురువారం మండలంలోని ఎర్రవల్లి, తిగుల్, మునిగడప గ్రామాల్లో జరిగే గ్రామజ్యోతి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. -
ఇసుక దందా పై ఎస్పీ కొరడా
- పోలీస్ నిఘా వర్గాల ద్వారా వివరాల సేకరణ - రవాణా వాహనాల సీజ్‌కు ఆదేశం మెదక్ టౌన్: సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘దర్జాగా ఇసుక దందా’ కథనంపై జిల్లా ఎస్పీ సుమతి స్పందించారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై వివరాల సేకరణకు పోలీస్ నిఘా వర్గాలను ఆయా గ్రామాలకు పం పించినట్లు సమాచారం. పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లికి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెళ్లి అక్కడ నిల్వ చేసిన ఇసుక డంప్‌లను ఫొటోలు తీసి వివరాలు సేకరిం చారు. దందాకు పాల్పడే వారి వివరాలు గ్రామస్తుల ద్వా రా తెలుసుకొంటున్నారు. ఇసుక అక్రమ రవా ణా చేసే వాహనాలను అక్కడికక్కడే సీజ్ చేయాలని పోలీసులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్లు తె లిసింది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేం దర్‌రెడ్డి గ్రామానికి వచ్చి కూర్చున్నా.. ఒక్క ఇసుక ట్రాక్టర్‌ను ఇక్కడి నుంచి వెళ్లనివ్వబోమని రామాయంపేట మండలం కె.వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంతో ప్రజల్లో చైతన్యం వస్తోందన్నారు. -
బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు
ఎస్పీ సుమతి హెచ్చరిక సంగారెడ్డి క్రైం : క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బడుగుల సుమతి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్, ఫోన్ తదితర సాధనాలు ఉపయోంచినా, లేదా నేరుగా బెట్టింగులకు పాల్పడినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడటం చట్టరీత్యా నేరమని, బెట్టింగులకు పాల్పడేవారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.బెట్టింగ్‌ల సమాచారాన్ని ఎవరైనా తమకు అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ముఖ్యంగా యువత బెట్టింగ్‌లకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. బుకీలు, నిర్వాహకులు, బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.