2 గంటలు... 3 ఏటీఎంలు | two hour's....... three atm's | Sakshi
Sakshi News home page

2 గంటలు... 3 ఏటీఎంలు

Published Thu, Dec 17 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

2 గంటలు... 3 ఏటీఎంలు

2 గంటలు... 3 ఏటీఎంలు

 ► విరుచుకుపడ్డ దోపిడీ దొంగలు సంగారెడ్డిలో రూ.3.21 లక్షలు..
 ► మెదక్‌లో ఏటీఎం ధ్వంసం అగ్నికి ఆహుతైన రూ. 3 లక్షలు
 ► బొలెరో వాహనంలో పరారైన ముఠా మెదక్‌లో పాత వాహనంతో  పోలీస్ చేజ్
 ► తప్పించుకున్న దొంగల ముఠా
 
 సంగారెడ్డి క్రైం/మెదక్/కౌడిపల్లి:
అర్ధరాత్రి వేళ.. అంతా నిద్రిస్తున్న సమయాన... దోపిడీ దొంగలు పంజా విసిరారు. రెండు గంటల వ్యవధిలోనే మూడు ప్రాంతాల్లోని ఏటీఎంలను ధ్వంసం చేశారు. ఒకచోట నగదుతో ఉడాయించగా మిగతా రెండు చోట్ల విఫలయత్నం చేశారు. మెదక్‌లో పోలీసులు చేజ్ చేసినా చిక్కకుండా తప్పించుకున్నారు. ఈ ఘటనలకు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ ముఠానే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఒకే ముఠా మూడు చోట్ల అదీ ప్రధాన రహదారులపై విరుచుకు పడి పోలీసులకు సవాల్ విసిరింది.
 
 మొదట సంగారెడ్డి బస్టాండ్‌లో...
 జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పాతబస్టాండ్‌లోగల ఇండి క్యాష్ ఏటీఎంలో దోపిడీ దొంగల ముఠా చొరబడింది. నలుగురు సభ్యులున్న ఈ ముఠా బొలెరో వాహనంలో వచ్చారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటల  ప్రాంతంలో ముఖాలకు ముసుగులు ధరించి, చేతులకు గ్లౌస్‌లు ధరించిన దుండగులు ఇండిక్యాష్ ఏటీఎంలోకి ప్రవేశించారు. మొదట సీసీ కెమెరాలను, వైర్లను ధ్వంసం చేశారు. ఏటీఎం మిషన్‌ను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేసి అందులోని రూ.3.21 లక్షల నగదుతో ఉడాయించారు.
 
 రెండోది కౌడిపల్లి...
 సంగారెడ్డిలో విజయవంతంగా పని పూర్తిచేసుకున్న దుండగులు నేరుగా నర్సాపూర్ మీదుగా కౌడిపల్లికి చేరుకున్నారు. కౌడిపల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంను దోచుకోవడానికి యత్నించారు.
 
 చివరగా మెదక్‌లో..
 కౌడిపల్లి నుంచి మెదక్ పట్టణానికి చేరుకున్న ఈ ముఠా సభ్యులు ఆటోనగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో ధ్వంసం చేయడానికి యత్నించారు. ఏటీఎం నుంచి మంటలు రావడం అదే సమయంలో గస్తీ పోలీసులు గమనించడంతో బొలెరో వాహనంలో పరారయ్యారు. దొంగల అలికిడిన గమనించిన పోలీసులు వారిని వెంబడించారు. మెదక్ నుంచి నిజామాబాద్ జిల్లా పరిధిలోని నాగిరెడ్డిపేట వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర దొంగలను పట్టుకోవడానికి చేజ్ చేశారు. ఈ క్రమంలో దొంగలపై నిజామాబాద్ జిల్లాలో అక్కడి పోలీసులు కాల్పులు సైతం జరిపారు.
 
  గ్యాస్ కట్టర్లతో మెదక్‌లోని ఏటీఎంను ధ్వంసం చేయడంతో మంటలు వ్యాపించి రూ.3 లక్షలు కాలి బూడిదయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత రెండు రోజులుగా నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఏటీఎంలే లక్ష్యంగా ముఠా పంజా విసురుతుంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా బ్యాంకర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మూడు ఘటనల్లోనూ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది.
 
 సందర్శించిన ఎస్పీ సుమతి
 మెదక్: దుండగుల చేతిలో ధ్వం సమైన మెదక్ పట్టణంతోపాటు కౌడిపల్లిలోని ఏటీఎం కేంద్రాలను ఎస్పీ సుమతి సందర్శించారు. దోపిడీకి యత్నించిన తీరును ఆమె పరిశీలించారు. ఏటీఎంకు సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ మేనేజర్లను అడిగి  తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దొంగలను పట్టుకొని తీరుతామన్నారు. గత అక్టోబర్ లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాల్లో ఇలాంటి చోరీలు జరిగాయన్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.
 
 దొంగలను వెంబడించిన పోలీసులకు రివార్డు..
 మెదక్‌లోని ఏటీఎంలో చోరీ విషయాన్ని గమనించి దొంగలను వెంబడించిన గస్తీ బృందంలోని హెడ్‌కానిస్టేబుల్ ఎక్బాల్, జీపు డ్రైవర్, కానిస్టేబుల్ వీరప్ప, హోంగార్డు విష్ణులకు ఎస్పీ సుమతి నగదు రివార్డు ప్రకటించి అభినందించారు. ఆమెవెంట డీఎస్పీ రాజారత్నం, రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు హన్మంత్, ఎల్లాగౌడ్, సంతోష్‌కుమార్ ఉన్నారు.
 
 
 సీసీ కెమెరాను పైకి లేపి...
 కౌడిపల్లి: నర్సాపూర్-మెదక్ ప్రధాన రహదారిపై మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ఎస్‌బీఐ ఏటీఎంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. కేంద్రంలోకి చొరబడి సీసీ కెమెరాలను పైకి తిప్పారు. ఏటీఎం ముందు డోర్ లాక్‌తీశారు. అందులో డబ్బులు లేకపోవడంతో కింద ఉన్న  బాక్స్‌ను పగులగొట్టి తెరిచారు. లోపలి భాగంలో గల క్యాష్ లాకర్ తెరుచుకోకపోవడంతో చేసేదిలేక వెనుదిరిగారు.
 
  బుధవారం ఉదయం స్థానికులు గమనించి బ్యాంకు అటెండర్ పోచాగౌడ్‌కు తెలిపారు. ఆ వెంటనే అతను విషయాన్ని మేనేజర్ మధుతోపాటు పోలీసులకు సమాచారం అందించాడు. నర్సాపూర్ సీఐ తిరుపతి రాజు,  స్థానిక ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 
 డబ్బు భద్రం..
 ఏటీఎంలో డబ్బు భద్రంగా ఉందని బ్యాంక్ మేనేజర్ మధు తెలిపారు. ఏటీఎం ముందు భాగం మాత్రమే తెరిచారని, వెనుక క్యాష్‌బాక్స్ తెరుచుకోవపోవడంతో కింద ఉన్న బాక్స్‌ను తెరిచారన్నారు. క్యాష్‌బాక్స్ తెరుచుకోక పోవడంతో ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఇందులో సుమారు రూ 8 లక్షలు ఉన్నట్టు చెప్పారు.
 
 ఓపెన్ కానీ సీసీ కెమెరా ఫుటేజీ..
 కౌడిపల్లిలోని ఏటీఎంలో చోరీకి యత్నించిన విషయాన్ని సీసీ కెమెరా ఆధారంగా దొంగలను గుర్తించే అవకాశాన్ని మేనేజర్ పరిశీలించారు. కాగా సీసీ కెమెరా ఫుటేజీలు కంప్యూటర్‌లో ఓపెన్ కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement