ఇబ్రహీంపూర్ ఘటనలో ఇరువర్గాలపై కేసులు | In the event of cases on both sides ibrahimpur | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపూర్ ఘటనలో ఇరువర్గాలపై కేసులు

Published Sun, Jan 10 2016 2:34 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

ఇబ్రహీంపూర్ ఘటనలో ఇరువర్గాలపై కేసులు - Sakshi

ఇబ్రహీంపూర్ ఘటనలో ఇరువర్గాలపై కేసులు

♦ శ్రీహరిది హత్య కేసుగా నమోదు
♦ హత్య కేసులో ఆరుగురు.. దాడి ఘటనలో 33 మందిపై కేసు
♦ వీడియోల ఆధారంగానే నిందితుల గుర్తింపు: ఎస్పీ
 
 సిద్దిపేట రూరల్/ముస్తాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ ఘటనలో పోలీసులు ముందుకు కదులుతున్నారు.  కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్లకి  చెందిన టేకేదారు శ్రీరాం శ్రీహరిని కొట్టి చంపడం.. బాధిత కుటుంబీకులు, బంధువులు ఇబ్రహీంపూర్‌లోని సర్పంచ్ ఇంటిపై దాడికి పాల్పడి రణరంగాన్ని సృష్టించడంపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన వివరాలను శనివారం సిద్దిపేట రూరల్ పీఎస్‌లో ఎస్పీ సుమతి మీడియాకు వెల్లడించారు.

 శ్రీహరి హత్య కేసులో ఆరుగురిపై కేసు..
 కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్లకి చెందిన టేకేదారు శ్రీరాం శ్రీహరి (33)పై గురువారం సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో దాడి చేసి, ఆయన మృతికి కారణమైన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఇందులో సర్పంచ్ కుమారులు కుంబాల ఎల్లారెడ్డి, నాగిరెడ్డిలతోపాటు అదే గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, రజనీకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలపై కేసు నమోదైనట్టు చెప్పారు. ఇందులో రజనీకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పరారీలు ఉన్నారన్నారు.

 సర్పంచ్ ఇంటిపై దాడి ఘటనలో 33 మందిపై కేసు..
 ఇబ్రహీంపూర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనలో వీడియోల ఆధారంగా మొత్తం 33 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. శ్రీహరి మృతి చెందడంతో కోపోద్రిక్తులైన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్లతోపాటు పలు గ్రామాల నుంచి పెద్దఎత్తున ఇబ్రహీంపూర్‌కు శవంతో తరలివచ్చారని, మృతదేహంతో గ్రామంలోని సర్పంచ్ ఇంటిఎదుట ఆందోళనకు దిగడంతోపాటు సర్పంచ్‌ను సజీవ దహనం చేయడానికి యత్నించారన్నారు.

ఇందులో భాగంగానే సర్పంచ్ ఇంటిపై కిరోసిన్‌పోసి నిప్పంటించి దహనం చేయడంతో భారీగా ఆస్తినష్టం జరిగిందన్నారు. సర్పంచ్ కుంబాల లక్ష్మితోపాటు విలేకరి నాగరాజు, పోలీసులకూ గాయాలయ్యాయని, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై అక్కడ పోలీసులు తీసిన వీడియో క్లిప్పింగ్ ఆధారంగా మహిళలతో కలిపి మొత్తం 33 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది సర్పంచ్ ఈసరి కృష్ణను చేర్చారు. అలాగే, కొలాపురం కనకరాజు, ఉడత తిరుపతి, గడ్డమీది రాకేశ్, పల్లె తిరుపతిలను అరెస్ట్ చేశామన్నారు. మిగతా 27మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement