ఉల్లంఘనులే!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. అధికారులు, సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉండడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు కోర్టు ఆదేశాలనూ పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి అధికారులే కోర్టుకు ఎలా వెళ్లాలి.. నిబంధనలు ఎలా తుంగలో తొక్కాలో సదరు అక్రమార్కులకు తెలియచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగా అక్రమ కట్టడాలు ఇప్పుడు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. కోర్టు కేసుల కారణంగా వేలాది అక్రమ కట్టడాలు కూల్చివేయలేని పరిస్థితి ఏర్పడింది. కోర్టు కేసుల విషయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులే అక్రమార్కులకు గాడ్ ఫాదర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో భారీ వర్షాలతో నగరం నీటమునిగినప్పుడు పర్యటించిన మంత్రులకు నాలాలపైనే వెలసిన ఎన్నో భవనాలు కనిపించాయి. నగరంలో ఓ చోట నాలాను పూడ్చివేసి, పైన నిర్మించిన ఓ బహుళ అంతస్తుల భవనం ఫొటోను ట్విట్టర్ ద్వారా నగర పౌరుడొకరు మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కు పంపారు. ఇలా నగరంలో నాలాలపై, చెరువుల్లోనే కాక ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా బహుళ అంతస్తుల భవనాలున్నాయి.
భవనానికి తగిన సెట్‌బ్యాక్‌లుండవు. ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ తిరిగే దారుండదు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు ఉండవు. అంతిమంగా అసలు ఆ భవనానికి అనుమతే ఉండదు. అయినప్పటికీ జీహెచ్‌ఎంసీ అధికారులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇందుకు కారణం వాటికి సంబంధించిన కోర్టు కేసులు. అక్రమంగా భవనాల్ని నిర్మించడం.. వాటిని కూల్చివేయకుండా ఉండేందుకు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం గ్రేటర్‌లో అలవాటుగా మారింది. ఇందుకు కారకులు టౌన్‌ప్లానింగ్ అధికారులేనని చెప్పక తప్పదు. ఎక్కడైనా అక్రమ నిర్మాణం జరుగుతుంటే దిగువస్థాయి ఉద్యోగుల నుంచి వారి దృష్టికి రాక మానదు. ఇక బేరసారాలు మొదలవుతాయి. నిర్మాణం సాఫీగా చేసుకునేందుకు తమకివ్వాల్సిన మొత్తాన్ని మాట్లాడుకుంటారు. బీఆర్‌ఎస్ ద్వారా క్రమబద్ధీకరిస్తామంటారు. ఉన్నతాధికారులు, కమిషనర్ సైతం కూల్చివేతలకు ఆదేశాలివ్వకుండా కోర్టుల నుంచి స్టే తెచ్చుకునే వెసులుబాటు గురించీ చెబుతారు. అందుకు ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తారు. ఎటొచ్చీ జేబులు నింపుకునే కార్యక్రమంలో ఎన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడి దర్జాగా ఉండవచ్చో నేర్పుతారు. ఆ ధీమాతోనే నగరంలోని అక్రమార్కులు రెచ్చిపోయి విచ్చలవిడి నిర్మాణాలు జరుపుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అమాయకులు బలవుతున్నారు.
నోటీసు ఇవ్వగానే..
అక్రమాలకు పాల్పడినవారి భవనాలను కూల్చివేయాలన్నా ముందస్తు నోటీసులు ఇవ్వాల్సి ఉండటంతో , ఒక నోటీసు జారీ కాగానే కోర్టులకు వెళ్లి ఎలా స్టే తెచ్చుకోవాలో చెబుతారు. ఉన్నతాధికారుల నుంచి కూల్చివేతలకు ఆదేశాలు వచ్చినా చర్యలు తీసుకునేలోగా స్టేలు తెచ్చుకోవడంతో పలు అక్రమ భవనాలను కూల్చకుండా వదిలేశారు. మరోవైపు కోర్టు కేసులు లేని వాటికి సైతం కోర్టు కేసులున్నాయని ప్రచారం చేస్తూ వాటి జోలికి వెళ్లరు. తాము కోరిన విధంగా ముడుపులు అందుతుండటంతో టౌన్‌ప్లానింగ్ అధికారులే అక్రమార్కులకు గాడ్‌ఫాదర్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు పదినెలల్లోనే అక్రమ నిర్మాణాలు జరిపిన 128 భవనాల యజమానులు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. సివిల్‌కోర్టుల్లోనే కాక హైకోర్డు స్థాయిలోనూ పలు కేసులు పరిష్కారానికి నోచుకోకుండా మగ్గుతున్నాయి. ఎవరైనా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా, వాటిని వెంటనే వెకేట్ చేయించి, చర్యలు తీసుకోవాల్సి ఉండగా, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ పని చేయడం లేరు. జీహెచ్‌ఎంసీ తరపున కోర్టు కేసుల్లో వాదించాల్సిన స్టాండింగ్ కౌన్సెళ్లు సైతం లంచాల మత్తులో మునిగి అక్రమార్కులకే అనుకూలంగా వ్యవహరిస్తుండటాన్ని జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశాల్లోనూ సభ్యులు ఎండగట్టినా పరిస్థితిలో మార్పులేదు.
స్టాండింగ్ కౌన్సిళ్లూ అంతే..
టౌన్‌ప్లానింగ్ అధికారులతోపాటు ఆ విభాగం తరపున పనిచేసే స్టాండింగ్ కౌన్సిళ్లకూ అక్రమార్కులిచ్చే ముడుపులపైనే మోజు. అందుకే వారు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. స్టాండింగ్ కౌన్సిళ్లకు గౌరవ వేతనాలిచ్చేది జీహెచ్‌ఎంసీ తరపున పనిచేయడానికా.. లేక అక్రమార్కులకు అండగా నిలవడానికా..? అని గత సమావేశాల్లో సభ్యులు ప్రశ్నించారంటే వారి పనితీరు అర్థం చేసుకోవచ్చు. ఇలా అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన జీహెచ్‌ఎంసీలోని అధికారులు, స్టాండింగ్ కౌన్సిళ్లు, రాజకీయ నేతలూ తదితరులందరూ అక్రమార్కులకే అండగా ఉంటుండటంతో అక్రమ నిర్మాణాలు ఆకాశాన్నంటుతున్నాయి.
కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన..
29 అక్రమ భవనాలను కూల్చివేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించినా చర్యలు తీసుకోలేదంటే అక్రమార్కులపై టౌన్‌ప్లానింగ్ అధికారులకున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయని కంటెంప్ట్ కేసులు 144 ఉన్నాయంటే జీహెచ్‌ఎంసీ సిబ్బంది తీరును అంచనా వేసుకోవచ్చు.