డీల్ డన్ !
సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : కృష్ణా నదిలో అక్రమంగా డంప్ చేసిన రూ.30కోట్లకు పైగా విలువ చేసే ఇసుకను తరలించేందుకు డీల్ కుదిరింది. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను ఎలాగైనా తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు వ్యవహారం చక్కబెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే మొత్తంలో తమతోపాటు సహకారం అందిస్తున్న వారికి డబ్బుల్లో వాటా ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఈ వాటాలను కూడా ప్రభుత్వ పెద్దలే నిర్ణయించినట్లు సమాచారం. దీంతో రేపో.. మాపో భారీగా ఉన్న ఇసుక నిల్వలను లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భారీ ఎత్తున ఇసుకను నిల్వచేసిన వారిలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి బంధువు, ఒక సర్పంచ్ భర్త, అతని అనుచరుడు ఉన్నారు.
అదును చూసి...: లింగాయపాలెం, రాయపూడి పరిధిలో కృష్ణా నదీ తీరాన రూ.30కోట్లకు పైగా విలువచేసే ఇసుక డంప్ చేసి ఉన్న విషయం తెలిసిందే. డ్రెడ్జర్లు, భారీ యంత్రాలతో రాత్రి, పగలు తేడా లేకుండా నదిలోని ఇసుకను తవ్వి నిల్వచేశారు. ఈ అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ కథనాలపై స్పందించిన స్థానికులు.. ఇసుకను తరలించకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. దీంతో అక్రమార్కులు ఇసుకను తరలించకుండా కొద్దిరోజులు వేచిచూడాలని భావించారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలతో బేరం కుదరడంతో తరలింపునకు రంగంసిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.
కూలీల ఆశలపై నీళ్లు..: భూములు కోల్పోయి, ఉపాధి కరువైన కూలీలు ఈ అక్రమ ఇసుక నిల్వలను వినియోగించుకోవాలని భావించారు. అందులో భాగంగా కూలీలు కొందరు గృహనిర్మాణాలకు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి ఉపాధి పొందాలని భావించారు. కొందరు కూలీలు ఇసుకను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఇసుకాసురులు కృష్ణానది వద్దకు చేరుకుని కూలీల కదలికలను పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇసుక ఎవరు తరలించాలని చెప్పారు... క్వారీ ఎవరిది.. అని పలు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా తీసుకోవాలని చెప్పింది కదా? అందుకే గృహనిర్మాణాలకు తీసుకువెళుతున్నట్లు కూలీలు బదులిస్తున్నారు.
మంత్రుల మంతనాలు..: ఈ క్రమంలో అక్రంగా నిల్వ చేసిన ఇసుకను తరలించేందుకు కాంట్రాక్టర్ కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులను కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో సంబంధిత మంత్రి ఒకరు ఆ శాఖ అధికారులను క్వారీ వద్దకు పంపించారు. ఇసుక తామే నిల్వచేశామని కూలీలకు చెప్పించారు. ఇసుకను తీసుకువెళ్లడానికి వీల్లేదని కూలీలను హెచ్చరించారు. కూలీలు అధికారుల హెచ్చరికలకు బెదరకపోవడంతో... సదరు మంత్రితోపాటు గుంటూరు జిల్లాకు చెందిన మరో మంత్రి కలిసి ‘ముఖ్య’ నేత వద్ద ఇసుక పంచాయితీ పెట్టారు. వెంటనే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
‘ముందుండి ఇసుకను తరలించే బాధ్యత మీదే’ అని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఇసుక పంచాయితీ కొలిక్కి రావడంతో ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో వాటాలు నిర్ణయించారు. డంప్‌చేసిన ఇసుకను ప్రతి రోజూ 700 లారీల ద్వారా హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు తరలిస్తారు. లారీ ఇసుక రూ.40వేల చొప్పున నిర్ణయించినట్లు తెలిసింది. రోజుకు 700 లారీల ఇసుక ద్వారా రూ.2.80 కోట్లు రాబట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని వాటాలుగా పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఎకనమిక్ సిటీకి ప్రణాళికలు రూపొందించాలి : కలెక్టర్
విజయవాడ : జక్కంపూడిలో ఎకనమిక్ సిటీ ఏర్పాటు చేసి అక్కడ పరిశ్రమల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(ఎపిట్కో) అధికారులకు కలెక్టర్ బాబు.ఎ సూచించారు. కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఎపిట్కో ఉన్నతాధికారులతో జక్కంపూడిలో ఎకనమిక్ సిటీ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎకనమిక్ సిటీలో పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు ఉండాలన్నారు.
అనంతరం ప్రింటింగ్, ఫుట్‌వేర్ వంటి పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలను ఎపిట్కో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎకనమిక్ టౌన్‌షిప్‌లో వివిధ కేటగిరీలకు చెందిన గృహసముదాయాలు ఉంటాయని చెప్పారు. ఎకనమిక్ సిటీలో 3,75,232 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టడం వల్ల 32,650 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని, ఇందుకోసం రూ.1,500 కోట్ల పెట్టుబడులు అవసరమని తెలిపారు. ఈ సమావేశంలో ఎపిట్కో వైస్ చైర్మన్ రామనాథం, ఇంజినీరింగ్ అధికారులు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.