ఉసురుతీసిన వివాహేతర బంధం
Published Fri, Jan 6 2017 2:10 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
కొవ్వూరు : వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాల్ని బలిగింది. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు సీఐ పి.ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరు 23వ వార్డు ముస్లిం స్కూల్ వీధిలోని ఓ ఇంట్లో సంఘటన జరిగింది. పట్టణానికి చెందిన పూర్ణచంద్రరావు (23) అనే యువకుడు పాలిటెక్నిక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ముస్లిం స్కూల్ వీధికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా సహజీవనం చేస్తుండగా విషయం తెలిసిన పూర్ణచంద్రరావు సోదరుడు వెంకట సుబ్బారావు, అతని స్నేహితులు ఆమెను మందలించారు. పూర్ణచంద్రరావును రానిద్దని, వస్తే తమకు సమాచారం ఇవ్వాలని గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి పూర్ణచంద్రరావు ఆమె ఇంటికి వచ్చాడు. దీనిని ఆమె ప్రతిఘటించడంతో చనిపోతానని బెదిరించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆమె ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. ఆమె, తన కుమార్తెతో మరో గదిలో నిద్రపోయింది. గురువారం ఉదయం నిద్రలేచిన ఆమె పూర్ణచంద్రరావు ఉన్న గదికి గడియపెట్టి ఉండటంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు.
Advertisement
Advertisement