
కేసులను పరిష్కరిస్తున్న రాధాకృష్ణ కృపాసాగర్
ఖమ్మం లీగల్ : జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లావ్యాప్తంగా 988 కేసులు పరిష్కారమయ్యాయి. 2వేల మందికిపైగా కక్షిదారులు కేసుల నుంచి విముక్తి పొందారు. మోటారు వాహన ప్రమాద కేసుల లోక్ అదాలత్‌కు న్యాయమూర్తి రాధాకృష్ణ కృపాసాగర్ అధ్యక్షత వహించి.. 140 కేసులను పరిష్కరించారు. మొత్తం రూ.3.42కోట్ల పరిహారం బాధితులకు చెల్లించేందుకు బీమా కంపెనీ అధికారులు అంగీకరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారుపల్లి గంగాధర్ లోక్ అదాలత్ సభ్యుడిగా వ్యవహరించారు. బ్యాంక్, ఇతర సివిల్, టెలిఫోన్ కేసుల లోక్‌అదాలత్ బెంచ్‌కు న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి వీఏఎల్.సత్యవతి అధ్యక్షత వహించి.. 395 కేసులను పరిష్కరించారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి మేకల సుగుణారావు లోక్ అదాలత్ సభ్యుడిగా వ్యవహరించారు. రాజీ పడదగిన క్రిమినల్, ఇతర నేరాంగీకార కేసులను మెజిస్ట్రేట్‌లు డి.మాధవీకృష్ణ, డి.గీతారాణి, సీహెచ్.పంచాక్షరి, ఎన్.అమరావతి, సతీష్‌కుమార్, వెంకటేశ్వర్లు పరిష్కరించారు. న్యాయవాదులు దేవకీ శ్రీనివాస్ గుప్తా, కన్నాంబ, నాగటి రాము, ఎ.ఇంద్రాచారి, లక్ష్మీనారాయణ, కందుల అమరనాథ్ లోక్ అదాలత్ సభ్యులుగా వ్యవహరించారు. మధిరలో 297 కేసులు, సత్తుపల్లిలో 82, ఇల్లెందులో 48, భద్రాచలంలో 38, కొత్తగూడెంలో 128 కేసులు పరిష్కారమయ్యాయి.