మంథనిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పనులను ఆలస్యమవుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో హాస్టల్ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కాగా, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శంకుస్థాపన చేశారు.
-
రూ.3కోట్లతో నిర్మిస్తున్న పక్కాభవనం
-
నత్తనడకన పనులు.. అద్దె భవనాల్లో అవస్థలు
-
ఈ ఏడాది తగ్గిన విద్యార్థుల సంఖ్య
మంథని: మంథనిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పనులను ఆలస్యమవుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో హాస్టల్ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కాగా, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శంకుస్థాపన చేశారు. స్థల వివాదం కారణంగా అక్కడ పనులు నిలిపివేసిన అధికారులు.. ఎస్సీ బాలుర వసతిగృహం శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చి అదే స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాన్ని నిర్మాణాన్ని జూలైలో ప్రారంభించారు. కాంట్రాక్టర్ సకాలంలో భవన నిర్మాణ పనులు పూర్తిచేయకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. నాసిరకం ఇటుక, సిమెంట్ వాడడమే కాకుండా గోడలకు సరిగ్గా నీటిని పట్టకపోవడంతో పగుళ్లు చూపాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఈ విద్యా సంవత్సం నుంచే ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో వసతి కల్పిస్తామనడంతో ఎక్కువ మంది ఇందులో చేరేందుకు ముందుకు వచ్చారు. మంథని బీసీ, ఎస్సీ వసతిగృహాలతోపాటు ముత్తారం బీసీ వసతిగృహం ఇంటిగ్రేటెడ్‌లోనే విలీనం చేస్తారు. ఒక్కో వసతిగృహంలో మూడు వందల మంది విద్యార్థులకు అవకాశం ఉంది. అయితే భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో మంథని, ముత్తారం బీసీ హాస్టళ్లలో 120, ఎస్సీ వసతిగృహంలో 140 మంది విద్యార్థులు చేరారు. మంథని ఎస్సీ వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గోదావరినదికి వెళ్లే దారిలో ఓ అద్దె ఇంట్లో కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడంతో మరోచోట ఇంటిని అద్దెకు తీసుకునేందుకు అధికారులు వెతుకుతున్నారు. బీసీ వసతిగృహం సైతం శిథిలావస్థకు చేరడంతో వర్షం పడితే ఎప్పుడు కూలుతుందోననే భయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తునారు.
రెండు నెలల్లో పూర్తయ్యేనా..?
మరో రెండు నెలల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగిస్తామని అధికారులు అంటున్నా అది సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదుల నిర్మాణం పూర్తిచేసిన కాంట్రాక్టర్ విద్యుత్ ఏర్పాటు పనులు చేయాల్సి ఉంది. మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. పనులు ఇలాగే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరం వరకు కొత్త భవనం పూర్తియ్యే అవకాశముంది.
అదనపు గదుల్లోకి పంపిస్తాం..
విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అదనపు గదులను అద్దెకు చూస్తున్నాం. రెండుమూడు నెలల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పూర్తవుతుందని చెప్పారు. అప్పటివరకు అద్దె ఇంట్లో కొనసాగిస్తాం.
– రాజేశ్వరి, ఏఎస్‌డబ్ల్యూఓ, మంథని