rent bulidings
-
సొంత భవనాలు కలేనా..?
విజయనగరం రూరల్: ప్రభుత్వానికి ఏడాదికి వందల కోట్ల రూపాయల ఆదాయం తీసుకువచ్చే జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖకు సొంత భవనాలు లేవు. దీంతో కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆరేడేళ్ల కిందట భవన నిర్మాణాలకు నిధులు మంజూరైనా సకాలంలో పనులు ప్రారంభించకపోవడంతో వెనక్కి మళ్లిపోయాయి. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఎక్సైజ్ కార్యాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తూ ఫిబ్రవరిలో జీఓ జారీ చేసినా భవనాల పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వేల రూపాయల అద్దె.. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు జిల్లా కేంద్రంలోని తోటపాలెం, ప్రదీప్‌నగర్ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి నెలకు అద్దె రూపంలో వేలాది రూపాయలు పదేళ్లకు పైగా చెల్లిస్తున్నారు. దీంతోపాటు డీసీ, ఏసీ కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే ప్రతి ఏడాదీ భవనాలను మారుస్తుండడంతో సిబ్బందికి ఇక్కట్లు తప్పడం లేదు. విజయనగరం ఎక్సైజ్ సూపరింటిండెంట్ కార్యాలయం కలెక్టరేట్ ప్రాంగణంలోని శిథిల గదుల్లోనే నిర్వహిస్తున్నారు. శిథిల భవనాలే దిక్కు.. పట్టణంలోని బొగ్గులదిబ్బ ప్రాంతంలో ఉన్న విజయనగరం ఎక్సైజ్ స్టేషన్లు– 1, 2 ఉన్న భవనం దశాబ్దాల కిందటి నిర్మించినది కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వర్షాకాలం వస్తే భవనం పైకప్పు ఎప్పుడు కూలిపోతుందోనని అధికారులు, సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. భవనం పెంకులతో నిర్మించినది కావడంతో వర్షం నీరు కారిపోవడం.. తేళ్లు, జెర్రిలు భవనం పైకప్పు నుంచి కార్యాలయాల్లో పడుతుండడంతో సిబ్బంది భయపడుతున్నారు. పసుపు – కుంకుమకు మళ్లించేశారా? జిల్లా ఎక్సైజ్ డీసీ, ఏసీ, ఎక్సైజ్ సూపరింటిండెంట్ కార్యాలయాలు, రెండు ఎక్సైజ్ స్టేషన్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 4.34 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఫిబ్రవరి 11న జీఓ 255తో జీఓ జారీ చేశారు. దీంతో కంటోన్మెంట్ ప్రాంతంలో బొగ్గులదిబ్బ ఎక్సైజ్ స్టేషన్ల ప్రాంగణంలో సర్వే 637లో ఉన్న 1.67 ఎకరాల విస్తీర్ణంలో భవన కాంప్లెక్స్ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇంతలో ఎన్నికల ప్రకటన రావడం.. ఈ నిధులను పుసుపు – కుంకుమ పథకానికి మరలించేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రభుత్వమైనా సొంత భవన నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. -
ఇంటిగ్రేటెడ్ ఇంకెప్పుడు పూర్తయ్యేనో?
రూ.3కోట్లతో నిర్మిస్తున్న పక్కాభవనం నత్తనడకన పనులు.. అద్దె భవనాల్లో అవస్థలు ఈ ఏడాది తగ్గిన విద్యార్థుల సంఖ్య మంథని: మంథనిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పనులను ఆలస్యమవుతుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో హాస్టల్ నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు కాగా, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శంకుస్థాపన చేశారు. స్థల వివాదం కారణంగా అక్కడ పనులు నిలిపివేసిన అధికారులు.. ఎస్సీ బాలుర వసతిగృహం శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చి అదే స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాన్ని నిర్మాణాన్ని జూలైలో ప్రారంభించారు. కాంట్రాక్టర్ సకాలంలో భవన నిర్మాణ పనులు పూర్తిచేయకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. నాసిరకం ఇటుక, సిమెంట్ వాడడమే కాకుండా గోడలకు సరిగ్గా నీటిని పట్టకపోవడంతో పగుళ్లు చూపాయి. దీనిపై పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఈ విద్యా సంవత్సం నుంచే ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో వసతి కల్పిస్తామనడంతో ఎక్కువ మంది ఇందులో చేరేందుకు ముందుకు వచ్చారు. మంథని బీసీ, ఎస్సీ వసతిగృహాలతోపాటు ముత్తారం బీసీ వసతిగృహం ఇంటిగ్రేటెడ్లోనే విలీనం చేస్తారు. ఒక్కో వసతిగృహంలో మూడు వందల మంది విద్యార్థులకు అవకాశం ఉంది. అయితే భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో మంథని, ముత్తారం బీసీ హాస్టళ్లలో 120, ఎస్సీ వసతిగృహంలో 140 మంది విద్యార్థులు చేరారు. మంథని ఎస్సీ వసతిగృహానికి పక్కా భవనం లేకపోవడంతో గోదావరినదికి వెళ్లే దారిలో ఓ అద్దె ఇంట్లో కొనసాగిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడంతో మరోచోట ఇంటిని అద్దెకు తీసుకునేందుకు అధికారులు వెతుకుతున్నారు. బీసీ వసతిగృహం సైతం శిథిలావస్థకు చేరడంతో వర్షం పడితే ఎప్పుడు కూలుతుందోననే భయాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తునారు. రెండు నెలల్లో పూర్తయ్యేనా..? మరో రెండు నెలల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగిస్తామని అధికారులు అంటున్నా అది సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదుల నిర్మాణం పూర్తిచేసిన కాంట్రాక్టర్ విద్యుత్ ఏర్పాటు పనులు చేయాల్సి ఉంది. మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. పనులు ఇలాగే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరం వరకు కొత్త భవనం పూర్తియ్యే అవకాశముంది. అదనపు గదుల్లోకి పంపిస్తాం.. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అదనపు గదులను అద్దెకు చూస్తున్నాం. రెండుమూడు నెలల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పూర్తవుతుందని చెప్పారు. అప్పటివరకు అద్దె ఇంట్లో కొనసాగిస్తాం. – రాజేశ్వరి, ఏఎస్డబ్ల్యూఓ, మంథని