క్రీడాభివృద్ధికి ప్రభుత్వ సహకారం పెంచాలి
-
ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడలు
-
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట : దేశ కీర్తిని పెంపొందించడంలో క్రీడలు ముఖ్య భూమిక పోషిస్తున్నందువల్ల క్రీడలకు ప్రభుత్వాల సహకారం పెంచాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని బాలుర హైస్కూల్‌లో మంగళవారం 62వ ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడలను ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నత విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు క్రీడాకారులకు మెరుగైన వసతులు ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తాయన్నారు.
ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో మహిళలు కూడా రాణిస్తున్నందున పాఠశాలల స్థాయి నుంచే బాలికలు క్రీడా విభాగంలో శిక్షణ పొందాలన్నారు. డిప్యూటీ డీఈఓ రవీందర్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో కలసి కబడ్డీ ఆడారు. డిప్యూటీ డీఈఓ, ఎమ్మెల్యే ఇరుజట్లకు కెప్టెన్లుగా వ్యవహరించి అలరింపజేసారు. కార్యక్రమంలో ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కౌన్సిలర్ పాలాయి శ్రీనివాస్, పుల్లూరి స్వామి, ఎంఈఓ సారయ్య, గుడిపూడి రాంచందర్‌రావు, పుల్లూరి శ్రీనివాస్, ఎర్ర జగన్మోహన్‌రెడ్డి, వంగేటి అశోక్, పీఈటీలు బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.