చైనా కన్నా భారత్ దూసుకుపోతోంది...
విశాఖ: అభివృద్ధిలో చైనా కన్నా భారత్ దూసుకుపోతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న 20వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆయన సోమవారం ప్రసంగిస్తూ భారత్ ఆర్థికంగా ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు. పరిపాలనలో ఈ గవర్నెస్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అన్ని రకాల అనుమతులకు ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టామన్నారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయని, వనరులను సరైన రీతిలో వినియోగించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని వెంకయ్య అన్నారు.
అవినీతిపై ప్రధాని మోదీ యుద్ధం ప్రకటించారని, పెద్దనోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చేశాయని వెంకయ్య తెలిపారు. నల్లధనం, అవినీతి నిర్మూలనకే మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. మోదీ నిర్ణయం పట్ల పారదర్శకత పెరుగుతోందని వెంకయ్య పేర్కొన్నారు. కాగా పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, డాక్టర్ జితేంద్ర సింగ్, పీపీ చౌదరి, సుజనా చౌదరితో పాటు ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, కె.హరిబాబు, కేంద్రానికి చెందిన వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. రెండురోజులు పాటు జరిగే ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ మంత్రులు, ఐటీ కార్యదర్శులతో పాటు 1200మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.