- భారతీయ కార్మికుల నరకయాతన
--ఆకలితో అలమటిస్తున్న రెండు వేల మంది
మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా)
పొట్టకూటి కోసం దేశంగాని దేశం వలసపోయారు. సౌదీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో కంపెనీలు మూతపడగా, వీసా, పాస్‌పోర్టు సరిగాలేని వేలాది మంది భారతీయ కార్మికులు రోడ్డుపాలవగా, వారిని జైళ్లకు తరలించారు. జెద్దా ఔట్‌జైలులో బందీలుగా ఉన్న కార్మికులు మూడు రోజులుగా తినడానికి తిండి దొరక్క, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సౌదీలో పరిస్థితుల్ని రియాద్‌లో రిసార్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌వాసి పాలకుర్తి అజయ్‌గుప్తా ఫోన్ ద్వారా తెలిపారు.
అయితే సౌదీలో భారతీయ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. కార్మికుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ విదేశాంగశాఖ మంత్రి ప్రకటనలకు, సౌదీలోని మన రాయబార కార్యాలయం అధికారులు అనుసరిస్తున్న తీరు పూర్తి భిన్నంగా ఉంది. జెద్దా ఔట్ జైలులో దాదాపు రెండువేల మంది కార్మికులు బందీలుగా ఉన్నారు. ఔట్ జైలులో ఒక్కో గదిలో వందలాది మందిని బందీలుగా ఉంచారు. వారికి మూడు రోజుల నుంచి సరైన తిండి అందడం లేదు. కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదని తెలిసింది. విదేశాంగశాఖ మంత్రి స్పందించిన తరువాత ఒకటి, రెండు రోజులపాటు భోజన సదుపాయం, నీటి వసతి కల్పించారని, ఆ తర్వాత మళ్లీ ఎవరూ పట్టించుకోవడం లేదని జైళ్లలో మగ్గుతున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ కార్మికుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, వారిని స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని వారి కుటుంబీకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నారు.