jedda
-
సౌదీ అరేబియాలో ఎఫ్1 రేస్
దుబాయ్: ఫార్ములా వన్ (ఎఫ్1) రేసు క్యాలెండర్లో సౌదీ అరేబియా అరంగేట్రం చేయనుంది. వచ్చే ఏడాది జరిగే ఎఫ్1 సీజన్లో సౌదీలోని జిద్దా నగరాన్ని చేరుస్తూ ఎఫ్1 నిర్వాహకులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సౌదీ ఆటోమొబైల్, మోటార్ సైకిల్ సమాఖ్య (ఎస్ఏఎమ్ఎఫ్)తో ఒప్పందం కుదిరినట్లు వారు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన జిద్దా నగర శివార్లలోని ‘కార్నిక్’ వద్ద వద్ద స్ట్రీట్ ట్రాక్‌పై 2021 నవంబర్‌లో ఈ రేసును నిర్వహిస్తున్నట్లు ఎఫ్1 తెలిపింది. ఎర్ర సముద్రానికి సమాంతరంగా ఉండే ఈ ట్రాక్ చూపరులకు కనువిందు చేస్తుందని వెల్లడించింది. ‘ఎఫ్1 సీజన్లోకి సౌదీ అరేబియాను ఆహ్వానిస్తున్నాం’ అని ఎఫ్1 సీఈవో చేస్ క్యారీ వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లో బహ్రెయిన్, అబుదాబిలు ఇప్పటికే ఎఫ్1 సీజన్‌ల్లో ఏటా రేస్‌లకు ఆతిథ్యమిస్తూ వస్తున్నాయి. సౌదీ రాజధాని రియాద్‌లో 2030 నాటికి ఫార్ములా వన్ రేసును నిర్వహించేలా... ట్రాక్‌ను కూడా నిర్మిస్తున్నారు. 2021 ఎఫ్1 సీజన్ క్యాలెండర్ పూర్తయిందని... త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని క్యారీ తెలిపారు. సౌదీ దేశంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ రేస్‌ను రాత్రి వేళ నిర్వహించే ప్రతిపాదన కూడా ఉంది. -
మూడు రోజులుగా జెద్దా ఔట్ జైలులో
- భారతీయ కార్మికుల నరకయాతన --ఆకలితో అలమటిస్తున్న రెండు వేల మంది మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) పొట్టకూటి కోసం దేశంగాని దేశం వలసపోయారు. సౌదీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో కంపెనీలు మూతపడగా, వీసా, పాస్‌పోర్టు సరిగాలేని వేలాది మంది భారతీయ కార్మికులు రోడ్డుపాలవగా, వారిని జైళ్లకు తరలించారు. జెద్దా ఔట్‌జైలులో బందీలుగా ఉన్న కార్మికులు మూడు రోజులుగా తినడానికి తిండి దొరక్క, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక నరకయాతన అనుభవిస్తున్నారు. సౌదీలో పరిస్థితుల్ని రియాద్‌లో రిసార్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌వాసి పాలకుర్తి అజయ్‌గుప్తా ఫోన్ ద్వారా తెలిపారు. అయితే సౌదీలో భారతీయ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. కార్మికుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ విదేశాంగశాఖ మంత్రి ప్రకటనలకు, సౌదీలోని మన రాయబార కార్యాలయం అధికారులు అనుసరిస్తున్న తీరు పూర్తి భిన్నంగా ఉంది. జెద్దా ఔట్ జైలులో దాదాపు రెండువేల మంది కార్మికులు బందీలుగా ఉన్నారు. ఔట్ జైలులో ఒక్కో గదిలో వందలాది మందిని బందీలుగా ఉంచారు. వారికి మూడు రోజుల నుంచి సరైన తిండి అందడం లేదు. కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదని తెలిసింది. విదేశాంగశాఖ మంత్రి స్పందించిన తరువాత ఒకటి, రెండు రోజులపాటు భోజన సదుపాయం, నీటి వసతి కల్పించారని, ఆ తర్వాత మళ్లీ ఎవరూ పట్టించుకోవడం లేదని జైళ్లలో మగ్గుతున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ కార్మికుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, వారిని స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని వారి కుటుంబీకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నారు. -
ఆలస్యంగా బయలుదేరిన ఎయిరిండియా విమానం
హైదరాబాద్(శంషాబాద్): ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో నిలిచిపోయిన ఎయిర్ ఇండియా జెడ్డా విమానం ఒకరోజు ఆలస్యంగా బయలుదేరింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు 155 మంది ప్రయాణికులతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన ఏఐ 965 విమానంలో సాంకేతిక లోపం తలె త్తడంలో అధికారులు దాన్ని నిలిపివేశారు. శనివారం సాయంత్రం వరకు కూడా విమానంలోని సాంకేతికలోపం సరికాకపోవడంతో ఓ దశలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకు 155 ప్రయాణికులతో జెడ్డా విమానం ఇక్కడి నుంచి బయలుదేరినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. -
జెడ్డాలో ఉగాది సంబరాలు
జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డా, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీ కుటుంబాలు తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్ధా అధ్వర్యంలో ఉగాది పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన్మథ నామ ఉగాది పర్వదినం సందర్భంగా తమ చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడానికి నిర్ణయించిందీ సంస్థ. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ముస్లిం కుటుంబ పెద్దలకు, వారి చిన్నారులకు ఇస్లామిక్ క్విజ్ మరియు ఖురాన్ గ్రంధ పోటీలను కూడ ఉగాది సందర్భంగా తాజ్ నిర్వహించింది. తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్ధా) అధ్వర్యంలో సిలికానాంధ్ర మనబడి సహాయంతో తెలుగు బోధన కార్యక్రమాలకు ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలుగా తాము తాజ్ అధ్వర్యంలో తెలుగు బోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికి ఉగాది నుండి దానికి పదును పెట్టడానికి సిలీకానంధ్ర మనబడితో కలిసామని తాజ్ ప్రధాన కార్యదర్శి కుంట సాగర్ చెప్పారు. ఈ సందర్భంగా సీలికానాంధ్ర మనబడి అంతర్జాతీయ విభాగానికి చెందిన శరత్ వేట అమెరికా నుండి ఫోన్ ద్వార సమావేశంలో పాల్గోన్న వారిను ఉద్దెశిస్తూ తెలుగు భాష అవశ్యకత గూర్చి నొక్కిచెప్పారు. గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల ఆర్ధిక పరిస్ధితి మరియు ఇక్కడి పాఠశాలలో తెలుగు భాష అందుబాటులో ఉన్నందున మనబడి ఫీజు ఎడారి దేశాలలో తగ్గించాలని విజ్ఞప్తి చేసారు. తాజ్ అధ్యక్షుడు శేఖ్ మస్తాన్ మరియు ప్రధాన కార్యదర్శి కుంట సాగర్ మాట్లాడుతూ కుల,మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా తమ సంఘం కేవలం తెలుగు ప్రవాసీయుల కొరకు పని చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా క్విజ్ లో గెలుపొందిన వారికి తాజ్ ప్రతినిధులు విజయలక్ష్మి, శారదాంబ, మీనాక్షి, సాగర్, మస్తాన్ , యూసుఫ్ లు బహమతులు ప్రధానం చేసారు. ప్రతిభ కనబర్చిన చిన్నారులను తాజ్ మహిళ విభాగం కార్యదర్శి విజయలక్ష్మి ప్రశంసించారు. -
సౌదీలో ఘనంగా 'తాజ్' మాట ముచ్చట
ఓ వైపు రాష్ట్రం విభజన సెగతో ఉడికిపోతుంటే మరోవైపు ప్రవాసాంధ్రులు మాత్రం ప్రాంతాలకు అతీతంగా వేడుకలు జరుపుకుంటున్నారు. సౌదీ అరేబియాలోని జెద్ధాలో ప్రవాసాంధ్రుల సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్ధా (తాజ్) ఆధ్వర్యంలో జరిగిన మాట ముచ్చట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యాన్బూ, మదీనా, రాబిఖ్, అల్ లీత్, మక్కాలలో నివసించే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజ్ అధ్యక్షుడు మస్తాన్ షేక్ ...తాజ్ ఆవిర్భావ ఆవశ్యకతను వివరించగా, ప్రధాన కార్యదర్శి కుటుంబరావు సంఘం ఉద్దేశాలను వివరించారు. మహిళ విభాగం కార్యదర్శి విజయలక్ష్మి, మహ్మద్ ఇమ్రాన్, రాంబాబు, సయ్యద్ మెయిజ్, ఇందిర, భారతీలు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంజాద్ హుస్సేన్ బేగ్ పాడిన పాటలు ప్రసీత మనోజ్ చేసిన కూచిపూడి నృత్యం, విజయలక్ష్మి, రామసీతలు పాడిన గేయాలు ఆహుతుల్ని అలరించాయి.