'బందరు పోర్టులో చంద్రబాబుకు పరోక్ష వాటాలు'
విజయవాడ: బందరు పోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరోక్ష వాటాలున్నాయని వైఎస్ఆర్ సీపీ నేత గౌతంరెడ్డి ఆరోపించారు. పోర్టు భూముల అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. వాటాలున్నందుకే లక్షా ఐదువేల ఎకరాలను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని ఆయన సిద్ధమవుతున్నారని విమర్శించారు. గతంలో రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు సీఎం చంద్రబాబు భూములను అప్పజెప్పారని మండిపడ్డారు.
ప్రస్తుతం బందరు పోర్టుతో చైనా కంపెనీలకు భూములు కట్టబెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల సీఎం తన చైనా పర్యటనలో ఆ దేశ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రైతులకు అండగా వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని వైఎస్ఆర్ సీపీ నేత గౌతంరెడ్డి అన్నారు. మొత్తం భూమిలో 22వేల ఎకరాలు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు కోసం, మిగతా భూమి పారిశ్రామిక కారిడార్, తదితర అవసరాల కోసం కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.