ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి– మంత్రి జగదీశ్‌రెడ్డి
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి– మంత్రి జగదీశ్‌రెడ్డి
Published Sun, Jul 17 2016 8:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
అనంతారం (గుండాల) : బంగారు తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా ఆదివారం మండలంలోని అనంతారం, సుద్దాల గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కృష్ణారావుతో కలిసి మొక్కలు నాటిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజలు కీలకంగా పని చేశారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. గంధమల్ల రిజర్వాయర్ ద్వారా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగు నీరు అందించి సస్యశ్యామలం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మండలంలోని అనంతారం గ్రామంలో రూ.5 లక్షలతో మంజూరైన యువజన సంఘం భవన నిర్మాణానికి, రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులకు, సుద్దాలలో రూ.4.75 కోట్లతో మంజూరైన సుద్దాల, పల్లెపహాడ్ గ్రామాల మధ్య ఉన్న బిక్కేరుపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌లు ఆదివారం శంకుస్థాపన చేశారు.
మండలానికి వరాల జల్లు
గుండాల మండలం తుర్కలశాపురం జీడికల్ చౌరస్తా మిగిలిన మెటల్ పనులను బీటీగా మార్చేందుకు రూ.25 లక్షలు, అనంతారం నుంచి తేర్యాలలో మిగులు రోడ్డు పనిని బీటీగా మార్చేందుకు రూ.2 కోట్లు, 20 విద్యుత్ స్తంభాలను మంజూరు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి వరాలు గుప్పించారు. సుద్దాలలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.5 లక్షలు, యూత్ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, పల్లెపహాడ్‌లో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి సభా ముఖంగా ప్రకటించారు.
Advertisement