మూలాలు మరువను..ఎన్‌ఆర్‌ఐ జ్యోతిరెడ్డి | Inspiring Biography of Mrs. Jyothi Reddy | Sakshi
Sakshi News home page

మూలాలు మరువను..ఎన్‌ఆర్‌ఐ జ్యోతిరెడ్డి

Published Thu, Jun 1 2017 1:43 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

మూలాలు మరువను..ఎన్‌ఆర్‌ఐ జ్యోతిరెడ్డి - Sakshi

మూలాలు మరువను..ఎన్‌ఆర్‌ఐ జ్యోతిరెడ్డి

సాధారణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుదల
తన సక్సెస్‌పై ‘అయినా నేను ఓడిపోలేదు’ పుస్తకం రచన
మాతృదేశంలో అనేక సేవా కార్యక్రమాలు


సాక్షి, వరంగల్‌ రూరల్‌: తన మూలాలను ఎప్పటికీ మరువనని ఎన్‌ఆర్‌ఐ దూదిపాల జ్యోతిరెడ్డి అన్నారు. ఒకప్పుడు గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లి.. ఇప్పుడు యూఎస్‌ఏలో స్థిరపడి, ఎన్‌ఆర్‌ఐగా భారత్‌లోని అనాథల అభ్యున్నతి కోసం కృషిచేస్తున్నా రు. జ్యోతిరెడ్డి స్వగ్రామం వరంగల్‌ రూరల్‌ జిల్లా శా యంపేట మండలం మైలారం. గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం ప్రారంభం కాగా, ఆమె భర్త సమ్మిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ఆలయ నిర్మాణానికి భూమి విరాళంగా ఇవ్వడంతోపాటు, విగ్రహాల కొనుగోలు, అన్నదానం తదితర కార్యక్రమాలు సొంత ఖర్చుతో చేయిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి భవిష్యత్తులో అన్నివిధాలా కృషి చేస్తానని చెబుతున్న జ్యోతిరెడ్డిని మైలారంలో ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు వెల్లడించారు.

వ్యవసాయ కూలీ నుంచి అంతర్జాతీయ స్థాయికి
జ్యోతిరెడ్డి పదోతరగతి వరకు చదివి 1985 నుంచి 1990 వరకు మైలారం గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేశారు. 1991 నుంచి 2000 సంవత్సరం వరకు హన్మకొండలో ఉండి లైబ్రేరియన్‌గా, వయోజన విద్య కార్యక్రమాల్లో పనిచేస్తూనే ఓపెన్‌గా డిగ్రీ, పీజీ చదివారు. అనంతరం 2000లో యూఎస్‌ఏకు సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా వెళ్లారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి సీఈవోగా ఉన్నారు. హన్మకొండ అనాథ బాలల సదనంలో పెరిగిన జ్యోతిరెడ్డి ప్రస్తుతం అనాథ పిల్లల స్థితిగతులపై పీహెచ్‌డీ(పరిశోధన) కోసం అనేక దేశాలు పర్యటిస్తున్నారు.

మూలాలు మరిచిపోవద్దని..
సాధారణ మహిళ నుంచి ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ మూలాలు మరిచిపోవద్దని భారతదేశంలో సేవ చేస్తున్నారు. ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి ప్రోత్సాహంతో ‘అయినా నేను ఓడిపోలేదు’ అనే పుస్తకాన్ని రాశారు. సాదాసీదా స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగారో అందులో పొందుపరిచారు. కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ ద్వితీయ ఆంగ్ల సబ్జెక్టులో ‘ఐ యామ్‌ నాట్‌ డిఫీటెడ్‌’ పాఠ్యాంశాన్ని చేర్చినట్లు వివరించారు.

అనాథ పిల్లల స్థితిగతులపై పరిశోధన
భారతదేశంలో 3.5కోట్ల మంది అనాథలు ఉన్నారని, వారి కోసం విద్య, వైద్యం, అకామిడేషన్, ఆహారం, ఉద్యోగ కల్పన, మేజర్‌ అయ్యే వరకు సంరక్షణ అనే 6 అంశాలపై పరిశోధన చేస్తున్నట్లు ఆమె తెలిపారు. భారత్‌లో, వివిధ దేశాల్లో అనాథల విషయంలో ఆయా ప్రభుత్వాలు ఏమి చర్యలు తీసుకుంటున్నాయి? అనే విషయాలపై దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ విశ్వవిద్యాలయం ద్వారా పీహెచ్‌డీ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో అనాథల విషయంలో ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోతుండడంతో వారు పక్కదారి పడుతున్నారన్నారు.

సేవా కార్యక్రమాలు అనేకం..
అనాథ బాలల సదనంలో పెరిగిన జ్యోతిరెడ్డి అనాథ పిల్లల కోసం జ్యోతిరెడ్డి ఫౌండేషన్‌ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఉన్న పిల్లల కోసం ఆర్థిక సహకారం అందించడంతోపాటు రూ.11లక్షలతో అక్కడ సాయిబాబా ఆలయం నిర్మించారు. అదేవిధంగా ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రతి ఆగస్టు 27, 28, 29 తేదీల్లో క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడంతోపాటు, వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో 10/10 జీపీఏ వచ్చిన టెన్త్‌ విద్యార్థులకు మండలానికి ఇద్దరి చొప్పున రూ.10వేల చొప్పున బహుమతిగా ఇస్తున్నారు.

అనేక అవార్డులు..
అలుపెరుగని సేవా కార్యక్రమాలు చేస్తున్న జ్యోతిరెడ్డి ఇంటర్నేషనల్‌ యూత్‌ ఫెలోషిప్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎన్జీవోస్‌కు అడ్వైజరీ కౌన్సిల్‌ మెంబర్‌గా ఉన్నారు. ఇప్పటివరకు జ్యోతిరెడ్డి 16 అవార్డులు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం భారతజ్యోతి అవార్డు ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా ద సర్వెంట్‌ హ్యూమానిటీ అవార్డు వచ్చింది. వరల్డ్‌ పీస్‌ ఆర్గనైజేషన్‌ నుంచి శాంతియుత అవార్డు 2016లో వచ్చింది. 2015లో ‘ద బెస్ట్‌ తెలుగు ఎన్‌ఆర్‌ఐ’ ‘సాక్షి’ ఎక్స్‌లెన్సీ అవార్డును ‘సాక్షి’ చైర్‌పర్సన్‌ భారతి చేతులమీదుగా జ్యోతిరెడ్డి అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement