‘జాతీయ జెండాకు అవమానం’
‘జాతీయ జెండాకు అవమానం’
Published Tue, Aug 16 2016 6:02 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
* టీడీపీ పాటల మధ్య, చంద్రబాబును పొగుడుతూ జెండా ఆవిష్కరణ
* ఎంపీటీసీ, సర్పంచ్‌ని కాదని విద్యాకమిటీ చైర్మన్‌తో ఆవిష్కరణ
* టీడీపీ దేశద్రోహానికి పాల్పడిందన్న వైఎస్సార్‌సీపీ
నరసరావుపేట : స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ జెండాను అవమానించి దేశద్రోహానికి పాల్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. చింతలపాలెం గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్‌ల ఎదురుగానే జాతీయ జెండాను తెలుగుదేశం పార్టీ పాటల మధ్య విద్యాకమిటీ చైర్మన్‌తో ఎగుర వేయించారని విమర్శించారు. దీనికి సంబంధించిన సీడీలను విలేకరులకు అందించారు. వైఎస్సార్ సీపీ పట్టణ కార్యాలయంలో జెడ్పీటీసీ షేక్ నూరుల్‌అక్తాబ్, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన శంకరయాదవ్ విలేకరులతో మాట్లాడారు. నరసరావుపేట మండలంలోని చింతలపాలెం గ్రామంలో దేశభక్తి గీతాలు కాకుండా టీడీపీ పాటలు పెట్టి పార్టీని, చంద్రబాబును పొగుడుతూ దేశస్వాతంత్య్ర దినోత్సవాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించారని తెలిపారు. ప్రతి మండల ప్రజాపరిషత్ స్కూల్లో ఆ గ్రా మానికి సంబంధించిన ఎంపీటీసీ సభ్యునిచే జెండాను ఆవిష్కరించాలని, ఆయన లేకుంటే సర్పంచ్, ఆయన లేని సమయంలో విద్యాకమిటీ చైర్మన్‌చే జెండాను ఆవిష్కరింపచేయాలని ప్రభుత్వం జీవో జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. జెండా వందనం చేయాలని ఎంపీటీసీ సభ్యునికి ఆహ్వానం కూడా పంపినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ భూతమేకల శివయ్య, ఎంపీటీసీ సుంకర అంజయ్య ఎదురుగానే టీడీపీ వారిచే ఎంపికయిన విద్యా కమిటీ చైర్మన్‌చే జెండాను స్కూల్లో ఆవిష్కరించారని చెప్పారు. ఇది దేశద్రోహంగా తాము భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్కూలు కమిటీ చైర్మన్, సభ్యులు తదితరులపై పోలీసులకు ఫిర్యాదుచేస్తామన్నారు. దీంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకునేంతవరకు పోరాడతామని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ మైనార్టీ అధ్యక్షుడు నబీ సుభాని, మాజీ సర్పంచ్ పొదిలే ఖాజా, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ తదితరులున్నారు.
Advertisement
Advertisement