Indipence day
-
తెలంగాణ హెడ్‌కానిస్టేబుల్‌కు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డ్
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలో 1037 మంది పోలీస్, ఫైర్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బందికి గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్ అందించనుంది. ఈ మేరకు అవార్డ్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ పోలిస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్ అధికారి యాదయ్యకు దక్కడం విశేషంరాష్ట్రంలో ఇషాన్ నిరంజన్ నీలంపల్లి, రాహుల్ చైన్ స్నాచింగ్‌లు, అక్రమ ఆయుధాల సరఫరా చేసేవారు. అయితే వీళ్లిద్దరూ జూన్ 25,2022న దోపిడీకి పాల్పడ్డారు. ఆ మరుసటి సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య పట్టుకున్నారు. యాదయ్య నుంచి తప్పించునేందుకు నిందితులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో యాదయ్యపై దారుణంగా కత్తితో పలు మార్లు దాడి చేశారు. అయినప్పటికీ యాదయ్య వెనక్కి తగ్గలేదు. ప్రాణాల్ని ఫణంగా పెట్టి నిందితుల్ని పట్టుకున్నారు. కటకటాల్లోకి పంపారు. తీవ్రంగా గాయపడ్డ యాదయ్య 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన ధైర్య సహాసాల్ని కేంద్రం కొనియాడింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్యాలంటరీ అవార్డ్‌ను ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది. -
గోవా విముక్తికి భారత్ ఏం చేసింది?
మన దేశంలో గోవా విమోచన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 19న నిర్వహిస్తుంటారు. దేశంలోని అందమైన బీచ్‌లు కలిగిన రాష్ట్రం గోవా. నైట్ లైఫ్‌కు గోవా ప్రసిద్ధి చెందింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, అనేక రాచరిక రాష్ట్రాలు విదేశీ శక్తుల చేతుల్లో ఉండేవి. ఇటువంటి రాష్ట్రాల్లో గోవా ఒకటి. భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించింది. అయితే గోవా రాష్ట్రం అప్పటికి పోర్చుగీసు ఆధీనంలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 14 సంవత్సరాల తర్వాత 1961 డిసెంబర్ 19న గోవా భారతదేశంలో చేరింది. నాటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 19ని గోవా విమోచన దినంగా జరుపుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాటి ప్రభుత్వం, ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.. గోవా స్వాతంత్ర్యం కోసం అనేక సార్లు చర్చలు జరిపారు. అయితే పోర్చుగీస్.. గోవాకు విముక్తి కల్పించేందుకు ఏమాత్రం అంగీకరించలేదు. పోర్చుగీస్‌తో చర్చలు విఫలమైన తరువాత భారత ప్రభుత్వం గోవా స్వాతంత్ర్యం కోసం ‘ఆపరేషన్ విజయ్’ ప్రారంభించింది. గోవాకు విముక్తి కల్పించేందుకు 30 వేల మంది సైనికులతో కూడిన బృందాన్ని భారత్ యుద్ధరంగంలోకి దించింది. మూడు వేలమంది పోర్చుగీస్ సైనికులపై భారత వైమానిక దళం, నేవీ, ఆర్మీ దాడి చేశాయి. ఈ దాడి కేవలం 36 గంటలపాటు కొనసాగింది. దీంతో పోర్చుగీస్ బేషరతుగా గోవాపై నియంత్రణను వదులుకోవాలని నిర్ణయించుకుంది. ఈ దాడి తరువాత గోవా.. భారతదేశంలో చేరి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. అయితే 1987, మే 30న గోవాకు భారత్ పూర్తి రాష్ట్ర స్థాయి హోదాను కల్పించింది. నాటి నుండి ప్రతీ ఏటా మే 30ని గోవా వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. -
హాంకాంగ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హాంకాంగ్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా, కాన్సుల్ జనరల్ మిస్ సత్వంత్ ఖనాలియా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సుర్ సాధన గ్రూప్ వారి దేశభక్తి గీతాలు, సలాంగై డ్యాన్స్ అకాడమీచే 'జై హో'పై భరతనాట్యం, శ్రీ శక్తి అకాడమీ 'భారత్' కథక్లు అలరించాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హాంకాంగ్ ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. దేశం పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ...ప్రధాని మోదీకి మద్దతు పలికారు. అనంతరం 'ఆఫ్‌బీజేపీ' హాంకాంగ్, చైనా అధ్యక్షుడు సోహన్ గోయెంకా మాట్లాడుతూ 'భారత దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు చాటి చెప్పడమే తమ లక్ష్యమన్నారు. ఉపాధ్యక్షుడు రాజు సబ్నానీ, రమాకాంత్ అగర్వాల్, అజయ్ జకోటియా, రాజు షా, కుల్దీప్ ఎస్. బుట్టార్, సోనాలి వోరా, ఆఫ్ బీజేపీ హాంకాంగ్, చైనా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. -
దేశమాతకు గళార్చన స్వతంత్ర గేయాలు
‘‘భరతమాత బిడ్డలం అందరం భరతమాత బిడ్డలమేమందరం కలసి ఉంటె కలదు సుఖం కలహిస్తే దుఃఖమయం...’’ హైదరాబాద్, గచ్చిబౌలిలో ఓ ప్రసిద్ధ పాఠశాల. పేరు నాజర్ బాయ్స్ స్కూల్. దానికి ఎదురుగా ఓ అధునాతనమైన అపార్ట్మెంట్ లో దేశభక్తి గీతాలాపన జరుగుతుంటుంది. కొన్నేళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఓ పెద్దావిడ దేశభక్తి గీతాలు ఆలపిస్తున్నారు. ఆ పెద్దావిడ పేరు గుంటూరు ఈశ్వరమ్మ. పాట ఆగకూడదు! అరవై ఎనిమిదేళ్ల ఈశ్వరమ్మ కు మాటలతోపాటే పాటలు కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే వాళ్ల అమ్మ దమయంతికి పాటలు పాడడం ఇష్టం. ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లలను ఆడిస్తూ పాటలు పాడుతూనే ఉండేవారామె. అలా మొదలైన ఈశ్వరమ్మ పాట నేటికీ అంతే శ్రావ్యంగా జాలువారుతూనే ఉంది. ఇంట్లో వేడుకలు ఈశ్వరమ్మ పాట లేనిదే సంపూర్ణతను సంతరించుకోవు. ఆమె స్కూలుకెళ్లే రోజుల నుంచి ఆగస్టు 15, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి... ఇలా ఏ వేడుక అయినా సరే ఈశ్వరమ్మ పాట తప్పకుండా ఉండేది. ఆమె పాడడంతోపాటు ఆసక్తి ఉన్న పిల్లలకు నేర్పిస్తున్నారు కూడా. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాటలు పాడడానికి సిద్ధమవుతున్న పిల్లలకు ఆమె దేశభక్తి గేయాలు నేర్పిస్తున్నారు. ‘‘నా దగ్గర ఉన్న పాటల్లో చాలా పాటలు బయట ఎక్కడా దొరకవు. అంతమంచి పాటలు నా దగ్గరే ఆగిపోతే ఎలాగ? పిల్లలకు నేర్పిస్తే మరొక తరం తయారవుతుంది. నా దగ్గర నేర్చుకున్న పిల్లల్లో ఏ నలుగురైనా దీక్షగా నేర్చుకుని మరింత మందికి నేర్పిస్తే నాకదే తృప్తి’’ అన్నారు ఈశ్వరమ్మ. పాటల పుటలు ఈశ్వరమ్మది నల్గొండ జిల్లా, మిర్యాలగూడ. ఆమె చిన్నప్పటి నుంచి ఆటగా పాటలు పాడుతుండడంతో పదేళ్లకే మాస్టార్ని పెట్టి సంగీతం నేర్పించారు. ‘‘మా మాస్టారి పేరు పెంటపాటి సర్వేశ్వరరావు. ఆయన గేయ రచయిత కూడా కావడంతో పాటలు సొంతంగా రాసి మాకు నేర్పించేవారు. మా అమ్మ దగ్గర నేర్చుకున్నవి, నేను సేకరించినవి, మాస్టారు రాసిచ్చినవి అన్నీ కలిపి నా దగ్గర చాలా పాటలు ఉన్నాయి. పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల్లో పడి హార్మోనియం మీటడం మర్చిపోయాను. కానీ పాడడం మర్చిపోలేదు. నేను చదివింది ఎనిమిదవ తరగతి వరకే. కానీ మా వారు తెలుగు పండిట్ కావడంతో ఖాళీగా ఉన్నప్పుడు పద్యాలు పాడుకోవడం ఆయన అలవాటు. అలా నేనూ పద్యాలు నేర్చుకున్నాను. పాటలు, పద్యాలు పాడి పాటలు రాయడం వచ్చేసింది. పిల్లల ను ఉయ్యాలలో వేసేటప్పుడు సొంతంగా పాటలు రాసి పాడాను. సంక్రాంతి ముగ్గుల పాటలు, బతుకమ్మ పాటలు... మొత్తం 15 పాటలు రాశాను. జెండావందన గేయం మా మిర్యాలగూడలో జెండావందనానికి నాలుగు రోజుల ముందే నేను పాట పాడడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని కబురు చేసేవాళ్లు. హైదరాబాద్‌లో మా అబ్బాయి ఇంట్లో.. అపార్ట్మెంట్ జెండా ఆవిష్కరణలో దేశభక్తి గేయాలు పాడుతున్నాను. కరోనా వల్ల గతేడాది అపార్ట్మెంట్ లో ఉండే వాళ్లలో చాలామంది పతాకావిష్కరణకు రాలేదు. నేను వెళ్లి పాటలు పాడాను. కార్యవర్గ సభ్యులు నాతో గొంతు కలిపారు’’ అన్నారు ఈశ్వరమ్మ. అంతా నా బిడ్డలే! ఈ ఏడాది పిల్లలకు పాటలను జూమ్ సెషన్స్‌లో నేర్పిస్తున్నారామె. ‘‘దేశమాతను గౌరవిస్తూ పాట పాడడానికి పిల్లలు ముందుకు రావడమే గొప్ప సంతోషం. అలా ముందుకొచ్చిన పిల్లలందరూ నా మనుమళ్లు, మనుమరాళ్ల వంటి వాళ్లే’’ అంటున్న ఈశ్వరమ్మ భరతమాతకు ప్రతిరూపంగా కనిపించారు. – వాకా మంజులారెడ్డి -
స్వాతంత్ర్య వేడుకలు.. మోదీ మార్క్ ఇదే!
న్యూఢిల్లీ : 1947, ఆగస్ట్ 15.. రెండువందల ఏళ్ల నాటి నిరంకుశ పాలనకు తెరదించిన రోజు. అఖండ భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు. బుధవారం 120 కోట్లకుపైగా భారతీయులు 72వ స్వాతంత్ర్య దినోత్సోవ వేడుకలు జరుపుకోబోతున్నారు. రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మనందరికంటే కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే ప్రధాని పదవిలో ఉండి ఎర్రకోట నుంచి జాతీయజెండాను ఎగరవేయడం ప్రస్తుత పర్యాయంలో ఇదే ఆఖరిసారి కానుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 2019 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నాటికి నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని పక్కనబెడితే.. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మోదీకి ప్రత్యేమైనవే కాక ఈ పర్యాయంలో చివరివి కూడా. అయితే ఈ నాలుగేళ్లలో మోదీ పాలనలోనే కాకుండా పూర్వ సాంప్రదాయలు పాటించే విషయంలోనూ మోదీ కొత్త పంథానే అనుసరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల విషయంలోనూ ఆయన గత ప్రధానులు మన్మోహన్ సింగ్, వాజ్‌పేయ్‌ల దారిలో కాకుండా ఆయనకే ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన హయాంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వచ్చిన మార్పులు ఏవంటే... బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్... 1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం ఎర్రకోట చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో దాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ వలయాన్ని పూర్తిగా 360 డిగ్రీల కోణంలో పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఈ బుల్లెట్ ప్రూఫ్ వలయాన్ని తొలగించాల్సిందిగా ఆదేశించారు. కారణం వేడుకకు హాజరైన ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషించడం కోసం దీన్ని తొలగించాల్సిందిగా ఆదేశించారు. ఈ నాలుగేళ్లలో మోదీ ఒక్కసారి కూడా బుల్లెట్ ప్రూఫ్ వినియోగించలేదు. ఉపన్యాసం... గత ప్రధానులైన మన్మోహన్, వాజ్‌పేయ్ ముందుగా వారి అధికారులు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని చదివితే మోదీ మాత్రం తాను రూపొందించుకున్న ఉపన్యాసాన్నే ఇస్తారు. అంతేకాకుండా గత ప్రధానులు కేవలం 50 నిమిషాల్లోపు తమ ఉపన్యాసాన్ని ముగిస్తే మోదీ మాత్రం గంటన్నరపైగానే మాట్లాడతారు. 2016లో అత్యధికంగా 90 నిమిషాలు మాట్లాడారు. ప్రోటోకాల్స్... గత ప్రధానులందరు ముందుగా ఏర్పాటు చేసిన ప్రోటోకాల్స్‌ను పాటిస్తే మోదీ మాత్రం ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా వాటిని పాటించలేదు. ప్రోటోకాల్స్‌కు విరుద్ధంగా ఆయన ఆనాటి వేడుకల్లో భాగంగా డ్రిల్‌లో పాల్గొన్న చిన్నారులను స్వయంగా కలిసి వారితో మాట్లడతారు. జాతీయ జెండా ఉన్న పోడియంను చేరడానికి మిగతా ప్రదానులందరూ లిఫ్ట్ ఉపయోగిస్తే మోదీ మాత్రం స్వయంగా నడుచుకుంటూ పోడియం దగ్గరకి చేరుకుంటారు. రిపోర్టు కార్డ్స్... మోదీకి ముందు ప్రధానులందరు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నూతన పథకాలను ప్రకటించేవారు. అయితే మోదీ మాత్రం పథకాలతో పాటు వాటి గడువును కూడా ప్రకటించేవారు. అంతేకాక గతేడాది ప్రకటించిన పథకాల పనితీరుకు సంబంధించిన పురోగతిని రిపోర్టు కార్డుల రూపంలో ఈ ఏడాది ప్రకటించేవారు. -
ఎర్రకోట నుంచి సంచలన ప్రకటన!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఆగస్ట్ 15న ఢిల్లీలోని ఎర్రకోట నుంచి చేసే ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారా? ఒకవేళ అదే నిజమైతే.. ఆ ప్రకటన దేని గురించి అయి ఉంటుంది?.. ప్రస్తుతం దేశ రాజధానిలో రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలకు సంబంధించి విరివిగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు మోదీ అకస్మాత్తుగా రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేసిన విషయాన్ని కూడా ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా వారణాసిలో పార్టీ సీనియర్ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలతో రహస్యంగా జరిపిన సమావేశం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేశారని చెబుతున్న వ్యాఖ్యలు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ‘ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. త్వరలో ప్రధాని నుంచి ఓ కీలక ప్రకటన వెలువడబోతోంది. ఆగస్ట్ 15 తరువాత దేశమంతా ‘ఎలక్షన్‌మోడ్’లోకి వెళ్లబోతోంది. పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. 2014లో ఇక్కడ మనకొచ్చిన 44% ఓట్ల శాతాన్ని 50 శాతానికి పెంచే దిశగా కృషి చేయాలి’ అంటూ ఆ భేటీలో అమిత్‌షా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. షా వ్యాఖ్యలను బట్టి ఆగస్ట్ 15న ప్రధాని నుంచి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ వర్గాలను సమాయత్తపరిచేందుకు షా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఖరీఫ్ సీజన్‌కు వరి, పత్తి సహా 14 పంటల కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది ప్రభుత్వం పట్ల రైతాంగంలో నెలకొన్న వ్యతిరేకతను తగ్గించే దిశగా తీసుకున్న నిర్ణయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారం కోసం ముందస్తు ఎన్నికలపై ఒకవైపు వార్తలు వినిపిస్తుంటే.. మరోవైపు, అది సాధ్యం కాదని, అవన్నీ నిరాధార కథనాలేనని బీజేపీ సీనియర్లే చెబుతున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ మూడు రాష్ట్రాల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఉపయోగపడేలా.. కుల సమీకరణాల నేపథ్యంలో.. మోదీ ప్రకటన ఉండవచ్చని బీజేపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, మోదీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదంటూ ఆయనే ముక్తాయించడం గమనార్హం. -
‘జాతీయ జెండాకు అవమానం’
* టీడీపీ పాటల మధ్య, చంద్రబాబును పొగుడుతూ జెండా ఆవిష్కరణ * ఎంపీటీసీ, సర్పంచ్‌ని కాదని విద్యాకమిటీ చైర్మన్‌తో ఆవిష్కరణ * టీడీపీ దేశద్రోహానికి పాల్పడిందన్న వైఎస్సార్సీపీ నరసరావుపేట : స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ జెండాను అవమానించి దేశద్రోహానికి పాల్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. చింతలపాలెం గ్రామంలో ఎంపీటీసీ, సర్పంచ్ల ఎదురుగానే జాతీయ జెండాను తెలుగుదేశం పార్టీ పాటల మధ్య విద్యాకమిటీ చైర్మన్‌తో ఎగుర వేయించారని విమర్శించారు. దీనికి సంబంధించిన సీడీలను విలేకరులకు అందించారు. వైఎస్సార్ సీపీ పట్టణ కార్యాలయంలో జెడ్పీటీసీ షేక్ నూరుల్‌అక్తాబ్, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన శంకరయాదవ్ విలేకరులతో మాట్లాడారు. నరసరావుపేట మండలంలోని చింతలపాలెం గ్రామంలో దేశభక్తి గీతాలు కాకుండా టీడీపీ పాటలు పెట్టి పార్టీని, చంద్రబాబును పొగుడుతూ దేశస్వాతంత్య్ర దినోత్సవాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించారని తెలిపారు. ప్రతి మండల ప్రజాపరిషత్ స్కూల్లో ఆ గ్రా మానికి సంబంధించిన ఎంపీటీసీ సభ్యునిచే జెండాను ఆవిష్కరించాలని, ఆయన లేకుంటే సర్పంచ్, ఆయన లేని సమయంలో విద్యాకమిటీ చైర్మన్‌చే జెండాను ఆవిష్కరింపచేయాలని ప్రభుత్వం జీవో జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. జెండా వందనం చేయాలని ఎంపీటీసీ సభ్యునికి ఆహ్వానం కూడా పంపినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ భూతమేకల శివయ్య, ఎంపీటీసీ సుంకర అంజయ్య ఎదురుగానే టీడీపీ వారిచే ఎంపికయిన విద్యా కమిటీ చైర్మన్‌చే జెండాను స్కూల్లో ఆవిష్కరించారని చెప్పారు. ఇది దేశద్రోహంగా తాము భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్కూలు కమిటీ చైర్మన్, సభ్యులు తదితరులపై పోలీసులకు ఫిర్యాదుచేస్తామన్నారు. దీంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకునేంతవరకు పోరాడతామని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ మైనార్టీ అధ్యక్షుడు నబీ సుభాని, మాజీ సర్పంచ్ పొదిలే ఖాజా, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ గౌస్ తదితరులున్నారు.