న్యూఢిల్లీ : 1947, ఆగస్ట్ 15.. రెండువందల ఏళ్ల నాటి నిరంకుశ పాలనకు తెరదించిన రోజు. అఖండ భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు. బుధవారం 120 కోట్లకుపైగా భారతీయులు 72వ స్వాతంత్ర్య దినోత్సోవ వేడుకలు జరుపుకోబోతున్నారు. రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మనందరికంటే కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే ప్రధాని పదవిలో ఉండి ఎర్రకోట నుంచి జాతీయజెండాను ఎగరవేయడం ప్రస్తుత పర్యాయంలో ఇదే ఆఖరిసారి కానుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 2019 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నాటికి నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని పక్కనబెడితే.. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మోదీకి ప్రత్యేమైనవే కాక ఈ పర్యాయంలో చివరివి కూడా. అయితే ఈ నాలుగేళ్లలో మోదీ పాలనలోనే కాకుండా పూర్వ సాంప్రదాయలు పాటించే విషయంలోనూ మోదీ కొత్త పంథానే అనుసరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల విషయంలోనూ ఆయన గత ప్రధానులు మన్మోహన్ సింగ్, వాజ్‌పేయ్‌ల దారిలో కాకుండా ఆయనకే ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన హయాంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వచ్చిన మార్పులు ఏవంటే...
బుల్లెట్ ప్రూఫ్ ఎన్‌క్లోజర్...
1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం ఎర్రకోట చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో దాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ వలయాన్ని పూర్తిగా 360 డిగ్రీల కోణంలో పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఈ బుల్లెట్ ప్రూఫ్ వలయాన్ని తొలగించాల్సిందిగా ఆదేశించారు. కారణం వేడుకకు హాజరైన ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషించడం కోసం దీన్ని తొలగించాల్సిందిగా ఆదేశించారు. ఈ నాలుగేళ్లలో మోదీ ఒక్కసారి కూడా బుల్లెట్ ప్రూఫ్ వినియోగించలేదు.
ఉపన్యాసం...
గత ప్రధానులైన మన్మోహన్, వాజ్‌పేయ్ ముందుగా వారి అధికారులు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని చదివితే మోదీ మాత్రం తాను రూపొందించుకున్న ఉపన్యాసాన్నే ఇస్తారు. అంతేకాకుండా గత ప్రధానులు కేవలం 50 నిమిషాల్లోపు తమ ఉపన్యాసాన్ని ముగిస్తే మోదీ మాత్రం గంటన్నరపైగానే మాట్లాడతారు. 2016లో అత్యధికంగా 90 నిమిషాలు మాట్లాడారు.
ప్రోటోకాల్స్...
గత ప్రధానులందరు ముందుగా ఏర్పాటు చేసిన ప్రోటోకాల్స్‌ను పాటిస్తే మోదీ మాత్రం ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా వాటిని పాటించలేదు. ప్రోటోకాల్స్‌కు విరుద్ధంగా ఆయన ఆనాటి వేడుకల్లో భాగంగా డ్రిల్‌లో పాల్గొన్న చిన్నారులను స్వయంగా కలిసి వారితో మాట్లడతారు. జాతీయ జెండా ఉన్న పోడియంను చేరడానికి మిగతా ప్రదానులందరూ లిఫ్ట్ ఉపయోగిస్తే మోదీ మాత్రం స్వయంగా నడుచుకుంటూ పోడియం దగ్గరకి చేరుకుంటారు.
రిపోర్టు కార్డ్స్...
మోదీకి ముందు ప్రధానులందరు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నూతన పథకాలను ప్రకటించేవారు. అయితే మోదీ మాత్రం పథకాలతో పాటు వాటి గడువును కూడా ప్రకటించేవారు. అంతేకాక గతేడాది ప్రకటించిన పథకాల పనితీరుకు సంబంధించిన పురోగతిని రిపోర్టు కార్డుల రూపంలో ఈ ఏడాది ప్రకటించేవారు.
Comments
Please login to add a commentAdd a comment